భారతీయ కుటుంబాల్లో తాతముత్తాతల కాలం నాటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఎంత ఆరోగ్యకరమైనవో ఈ రోజుల్లో చాలామందికి అర్థమవుతోంది. ఒకప్పుడు పాతకాలపు అలవాట్లు అని పక్కనపెట్టిన కొన్ని వంటకాలు, ఇప్పుడు మళ్లీ మన ప్లేట్లలోకి వస్తున్నాయి. మన తాతలు, బామ్మలు రోజూ తిని, ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్న ఆ 8 అద్భుతమైన ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం....
1. మిల్లెట్స్
ఇప్పుడు 'సూపర్ ఫుడ్' అని పిలుచుకుంటున్న జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు ఒకప్పుడు మన ఇంట్లో రోజూ వండుకునేవే. అప్పట్లో వీటితో రొట్టెలు, అంబలి చేసుకుని తినేవారు. మధ్యలో పాలిష్ చేసిన బియ్యం, మైదా వాడకం ఎక్కువై ఇవి కాస్త పక్కకు పోయాయి. కానీ, వీటిలో ఉండే ఫైబర్, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచే గుణం వల్ల ఇప్పుడు యువత మళ్లీ చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతోంది.
2. బెల్లం
షుగర్ రాకముందు మన ఇళ్లలో తీపి కోసం బెల్లాన్నే వాడేవారు. పాలలో కలుపుకోవాలన్నా, పిండివంటలు చేయాలన్నా బెల్లమే కావాలి. అంతేకాదు, తిన్నది అరగడానికి అప్పట్లో భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినే అలవాటు ఉండేది. ఇప్పుడు కెమికల్స్ ఉండే తెల్ల చక్కెరకు దూరంగా ఉండాలనుకునే వారికి బెల్లం ఒక అద్భుతమైన, సహజమైన ప్రత్యామ్నాయంగా మారింది.
3. పెరుగు
పెరుగు అనేది మనకు కొత్తగా అలవాటైనది కాదు, అది మన వంటకాల్లో ఒక భాగం. ఎండ వేడి నుంచి శరీరాన్ని చల్లబరచడానికి పెరుగు, మజ్జిగలను మన పెద్దవాళ్లు ఎక్కువగా నమ్మేవారు. ఇప్పుడు సైన్స్ దీనిని 'ప్రోబయోటిక్' అని చెప్తోంది. కడుపు ఉబ్బరంగా ఉన్నా, జీర్ణక్రియ బాగుండాలన్నా పెరుగును మించిన మందు లేదు.
4. మఖానా
ఒకప్పుడు పూజలు, ఉపవాసాల సమయంలో మాత్రమే స్టీల్ డబ్బాల్లోంచి బయటకు తీసే మఖానా.. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు, సూపర్ మార్కెట్లలో ఫ్యాన్సీ ప్యాకెట్లలో దొరుకుతోంది. తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ ఉండే హెల్దీ స్నాక్‌గా దీనికి క్రేజ్ పెరిగింది. అప్పట్లో తాతమ్మలు సాయంత్రం పూట పిల్లలకు నెయ్యి, ఉప్పు వేసి వేయించి ఇచ్చే ఈ సింపుల్ చిరుతిండి, ఇప్పుడు బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
5. స్వచ్ఛమైన నెయ్యి
మధ్యలో కొన్ని రోజులు నెయ్యి తింటే లావు అవుతారనే అపోహతో చాలామంది దీనికి దూరంగా ఉన్నారు. కానీ మన తాతముత్తాతలు పప్పులో, అన్నంలో, రొట్టెల్లో నెయ్యిని ధైర్యంగా వాడేవారు. అది శరీరానికి బలాన్ని ఇస్తుందని నమ్మేవారు. ఇప్పుడు నెయ్యిలోని గుడ్ ఫ్యాట్స్ తెలిసి, ఫిట్‌నెస్ ప్రియులు మళ్లీ ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యిని డైట్‌లో చేర్చుకుంటున్నారు.
6. ఫెర్మెంటెడ్ ఫుడ్స్
మన ఇళ్లలో రోజూ తినే ఇడ్లీ, దోసె, గంజి, ఊరగాయలు అన్నీ పులియబెట్టడం ద్వారానే తయారవుతాయి. 'మైక్రోబయోమ్', 'గట్ హెల్త్' లాంటి పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు తెలియకపోయినా.. ఈ పులియబెట్టిన వంటకాలు పొట్టకు ఎంత మంచిదో మన ముత్తాతలకు బాగా తెలుసు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
7. ఇంట్లో చేసే చట్నీలు, మసాలాలు
అప్పట్లో చట్నీలు అంటే నంజుకోవడానికి మాత్రమే కాదు, అవి రోగనిరోధక శక్తిని పెంచేవి. కొబ్బరి, వేరుశెనగ, పుదీనాలతో రోట్లో నూరిన తాజా చట్నీలు తినేవారు. వాటితో పాటు వాము, జీలకర్ర, మెంతి, పసుపు, మిరియాలు వంటి మసాలాలను కేవలం రుచి కోసమే కాకుండా ఒంటికి మేలు చేసే ఔషధాలుగా వాడేవారు. ఇప్పుడు ఆర్గానిక్, సహజమైన రుచుల కోసం జనం మళ్లీ వీటి కోసం వెతుక్కుంటున్నారు.
8. సత్తు పిండి
ప్రోటీన్ షేక్‌లు, ఎనర్జీ డ్రింక్స్ లేని కాలంలో రైతులకు సత్తు పిండే అతిపెద్ద బలం. వేయించిన శనగలతో చేసే ఈ పిండిని నీళ్లు, కాస్త ఉప్పు లేదా బెల్లంతో కలిపి తాగేవారు. ఇది చవకైనది, త్వరగా శక్తినిచ్చేది. ఉత్తర భారతదేశంలో దీనితో పరాటాలు కూడా చేస్తారు. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచే గుణం దీనికుంది. ఇప్పుడు పౌడర్ల వెనకాల పరిగెత్తే యువత, ఈ సహజమైన ప్రోటీన్ పౌడర్ వైపు మళ్ళీ మళ్లుతోంది.
