
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించగా.. 43 మంది గాయపడ్డారు. సోమవారం (ఆగస్ట్ 25) తెల్లవారుజూమున బులంద్‌షహర్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. చెల్లాచెదురుగా పడిన డెడ్ బాడీలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటన స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉండగా.. గాయపడ్డవారిలో 12 మంది 18 ఏళ్లలోపే వారేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు ప్రారంభించారు.
ఈ ఘటనపై బులంద్‌షహర్ రూరల్ ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్నియా బైపాస్ సమీపంలోని బులంద్‌షహర్-అలీఘర్ సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున 2.10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాస్గంజ్ జిల్లాలోని రఫత్‌పూర్ గ్రామం నుంచి రాజస్థాన్‌లోని జహర్‌పీర్‌కు తీర్థయాత్రకు 61 మంది యాత్రికులతో బయలుదేరిన ట్రాక్టర్‌ను లారీ వెనక నుంచి ఢీకొట్టిందని చెప్పారు.
లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడి అందులో ప్రయాణిస్తోన్న 8 మంది మృతి చెందగా.. 43 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. గాయపడ్డవారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందన్నారు.
మృతులను ట్రాక్టర్ డ్రైవర్ ఇయు బాబు (40), రాంబేటి (65), చాందిని (12), ఘనిరామ్ (40), మోక్షి (40), శివాంశ్ (6), యోగేష్ (50), వినోద్ (45) గా గుర్తించామని తెలిపారు. మృతులంతా కాస్గంజ్ జిల్లాకు చెందినవారేనని.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన ట్రక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.