హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 81 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు లభించాయి. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(సీఏఎస్) కింద అర్హులైన వీరిని అకడమిక్ లెవల్ 13ఏ నుంచి లెవల్ 14 (ప్రొఫెసర్ గ్రేడ్)కు ప్రమోట్ చేస్తూ కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.శ్రీదేవసేన శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీసీ ఆర్‌పీఎస్ 2016 నిబంధనల ప్రకారం.. మల్టీ జోన్-1 పరిధిలో 38 మంది, మల్టీ జోన్-2 పరిధిలో 43 మంది పదోన్నతులు పొందారు.
ప్రమోషన్ పొందిన వారి వివరాలను వెంటనే వారి సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేయాలని ప్రిన్సిపాళ్లను కమిషనర్ దేవసేన ఆదేశించారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు రావడంతో డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ సంగి రమేశ్, కె.విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
