హైదరాబాద్లో అల్లం పేస్ట్ ఎలా కల్తీ చేస్తున్నారో చూడండి..ఇది తింటే ఆస్పత్రిపాలే..

హైదరాబాద్లో అల్లం పేస్ట్ ఎలా కల్తీ చేస్తున్నారో చూడండి..ఇది తింటే ఆస్పత్రిపాలే..

హైదరాబాద్లో జోరుగా కల్తీ అల్లం వెల్లుల్లి దందా సాగుతోంది. వంటకాల్లో తప్పనిసరిగా వాడుకునే అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఓపక్క హైదరాబాద్ లో ఫుడ్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ల రైడ్స్ జరుగుతున్నప్పటికీ ఆహారపదార్థాలను కల్తీ చేస్తూ దండుకుంటున్నారు కల్తీగాళ్లు. డిమాండ్ ఉన్న వస్తువుకావడంతో పెద్ద ఎత్తున నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు.   

బుధవారం(జూన్4) హైదరాబాద్ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పటేల్ నగర్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్ FK ఫుడ్ ప్రాడక్ట్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. 870 కిలోల  కల్తీ అల్లం,వెల్లుల్లి పేస్ట్, 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మోనో సిట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ నిర్వహకుడు మొహమ్మద్ ఫైసల్‌ను అదుపులోకి తీసుకున్నారు.