
చదువుకోవాలనే తపన ఉండాలే కానీ వయసు అడ్డంకి కాదు. మనవండ్లు, మనవరాండ్లను చూసో, చదువు మీద ఇష్టంతోనో తొంభై ఏండ్ల వయసులోనూ పలకాబలపం పట్టిన వాళ్లు, బడికి పోయినవాళ్లు ఉన్నారు. ఈ పెద్దాయన కథ కూడా వాళ్ల లాంటిదే. పేరు జాన్ లేనెహన్. 88 ఏండ్ల వయసున్న ఈయన అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటాడు.
1956లో అక్కడి ఫోడమ్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేరాడు. అయితే... ఎయిర్‌లైన్ కంపెనీలో జాబ్ రావడంతో డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. పెద్దగా చదువుకోకపోయినా మంచి కెరీర్, ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఈయనకు ఆరుగురు సంతానం. వాళ్లకి14 మంది పిల్లలు. రిటైరయ్యాక మనవలు, మనవరాండ్లతో గడపకుండా...మధ్యలో ఆపేసిన డిగ్రీని పూర్తి చేయాలనుకున్నాడు జాన్. అప్పటికి ఆయన డిగ్రీ ఆపేసి 66 ఏండ్లు. ఇదే విషయం యూనివర్సిటీ వాళ్లకు చెప్తే వాళ్లు ‘ఓకే’ అన్నారు. పోయిన వారమే తోటి స్టూడెంట్స్‌తో కలిసి డిగ్రీ పట్టా అందుకు న్నాడు జాన్. తనకంటే అరవై ఏండ్లు చిన్నవాళ్లైన క్లాస్‌మెట్స్‌తో నవ్వుతూ ఫొటోలు కూడా దిగాడు.
నాలుగ్గంటలు ఎక్కువ
‘‘మళ్లీ పుస్తకాలు పట్టుకోవడం, పరీక్షలు రాయడం అంత కష్టం అనిపించలేదు. కాకపోతే ఇరవై ఏండ్లలో ఉన్నంత హుషారుగా లేకపోవడంతో క్లాసులు అర్థం చేసుకునేందుకు ఎక్కువ టైం పట్టింది. అయితే...అందరిలా రోజుకు మూడు గంటలు కష్టపడే బదులు నాలుగైదు గంటలు చదివేవాడిని. మనం మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేందుకు ఆలస్యం అయినా పర్లేదు. అది బిజినెస్, ప్రొఫెషనల్ లైఫ్ కావొచ్చు” అని చెప్తున్న ఈ తాతయ్య చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు.