ఉద్యోగులు, పెన్షనర్లపై వివక్ష సరి కాదు !

ఉద్యోగులు, పెన్షనర్లపై వివక్ష సరి కాదు !

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల పెంపు కోసం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వేతన కమిషన్ నియమించి వారి సిఫార్సుల మేరకు వేతనాలు పెంచుతోంది. 2014లో అధికారంలోనికి వచ్చిన మోదీ ప్రభుత్వం బిహార్ ఎన్నికలకు 3 రోజుల ముందు  8వ వేతన సంఘాన్ని నియమించింది. ఈ మేరకు నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ 18 నెలల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఇది నరేంద్ర మోదీ అధికారంలోనికి వచ్చిన తరువాత  ఏర్పాటు చేసిన తొలి వేతన సంఘం అని చెప్పాలి.

ఏడవ వేతన సంఘం 2014 ఎన్నికల ముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో నియమించగా 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది. అయితే  నవంబర్​లో  నివేదిక అందజేస్తే 2016 జూన్ లో  మోదీ ప్రభుత్వం ఆ నివేదికను  ఆమోదించింది.  ప్రతి వేతనసంఘం వేసినప్పుడు వేతనాలు, పెన్షన్లు,  బకాయిలు, చెల్లింపులకు  బడ్జెట్ కేటాయింపులు జరపాలి.

ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నియమిస్తున్న వేతన సంఘం.. ఉద్యోగులు, పెన్షనర్ల మీద ఖర్చు ఎలా తగ్గించాలని చూస్తున్నది.  ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా జులై 16న కేంద్రం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 10 నెలల తర్వాత బిహార్ ఎన్నికల ముంగిట సిపిసిని ఏర్పాటు చేసింది.

అంటే, మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సిపిసి చైర్మన్, తాత్కాలిక సభ్యుడిని నియమించేందుకు పది నెలలు పట్టింది.  కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చింది. 2027 సంవత్సరం మధ్యలో మాత్రమే నివేదిక  లేదా సిఫారసులను మనం ఆశించవచ్చు. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సమయానికి ఇంకా కొంత టైం పట్టవచ్చు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాలు సవరించడానికి మరో రెండు సంవత్సరాలు వేచి ఉండాలసిందే. ఇది ఉద్యోగులకు తీరని అన్యాయమే అవుతుంది.

పెన్షనర్లపై  వివక్ష చూపొద్దు
వేతనాలకు  మించి  పెన్షనర్ల  బిల్లు పెరిగిపోతున్నదని ప్రభుత్వం చెబుతున్నది. ఈ క్రమంలో  కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేవిధంగా నిబంధనలను రూపొందించి.. వేతన సవరణ సంఘానికి విధివిధానాలను ఖరారు చేసి ఇచ్చింది.  నిజానికి పెన్షనర్లకు సంబంధించి ఇది చేదువార్తే.  కేంద్రం తయారుచేసిన విధి విధానాలను అనుసరించే ఈ ఎనిమిదవ వేతన సంఘం నివేదిక తయారవుతుంది. మోదీ ప్రభుత్వం 2025 మార్చి 25న పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న చట్టంలో  2026 జనవరి ఒకటి కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు  ఆ తరువాత రిటైర్ కాబోయే పెన్షనర్లు' అనే విభజన రేఖ గీసింది.

8 వ వేతన సవరణ సంఘం సిఫార్సులు ఆ రిటైర్ కాబోయే పెన్షనర్లకు మాత్రమే వర్తించేటట్టు నిర్దేశించింది.  అంతకుముందు రిటైర్ అయిన పెన్షనర్లకు మొండిచెయ్యి చూపే అధికారాన్ని చేతుల్లో ఉంచుకుంది. 8వ  వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు మూడో అంశం దీన్నే సూచిస్తుంది.  దీని ప్రకారం 'నాన్ కంట్రిబ్యూటరీ' ( ఉద్యోగి విరాళం లేని), 'అన్ ఫండెడ్ ' ( నిధులు సమకూరని ) పెన్షన్ పథకాలకు అయ్యే వ్యయాన్ని లెక్క గట్టి దానికి అనుగుణంగా సిఫార్సులు చేయాలన్నారు.  ఏప్రిల్ 1, 2004 కంటే ముందు ఉద్యోగంలో చేరి,  జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ కాబోయే వారికి ఇది వర్తిస్తుంది. 

కమిషన్ల సిఫార్సులు
ప్రస్తుతం ఒక కోటి 20 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.  వీరితోపాటు రాష్ట్రాల సిబ్బంది మీద కూడా ఈ కమిషన్ సిఫార్సుల ప్రభావం పడనుంది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 లక్షల మంది వరకు ఉండగా, పెన్షనర్లు  69 లక్షల మంది ఉన్నారు.  రాబడిలో 18%  వేతనాలు, పెన్షన్లకి పోతున్నదని, ఒకవైపు పొదుపు, మరోవైపు న్యాయమైన వేతన సవరణ డిమాండ్ల మధ్య పోరు జరగనుందని చెప్తున్నారు.  దేశంలో తొలి వేతన కమిషన్ శ్రీనివాస వరదాచారి చైర్మన్ నేతృత్వంలో 1946లో ఏర్పాటు చేశారు.  కమిషన్ కనీస వేతనంగా రూ. 55, గరిష్ట వేతనం రూ. 2000  సిఫార్సు చేశారు. 1957లో ఏర్పాటైన రెండవ కమిషన్ ధరల పెరుగుదల కారణంగా కరువు భత్యాన్ని సిఫార్సు చేసింది.  మూడో వేతన కమిషన్  ఏడాదికి నాలుగుసార్లు డీఏ ప్రకటించే విధానాన్ని ప్రవేశపెట్టింది.

నాలుగో వేతన సంఘం అంతకుముందున్న ఏడాదికి నాలుగుసార్లు డీఏ ప్రకటించే విధానాన్ని రద్దుచేసి ఏడాదికి రెండుసార్లు డీఏ ప్రకటించేలా  సిఫార్సు  చేసింది. 1983లో ఐదో వేతన కమిషన్ ఇంటి అద్దెను సిఫార్సు చేసింది. ప్రతి వేతన కమిషనుకు  ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వారి డిమాండ్లను  పొందుపరిచి ఇస్తుంటారు.  వాటిలో  సాధ్యాసాధ్యాలను కమిషన్ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగసంఘాలు 15 డిమాండ్లను  8వ  వేతన సంఘం నియామకానికి ముందే ప్రభుత్వం ముందు ఉంచాయి.  వాటిని వేతనసంఘం పరిగణనలోనికి తీసుకొని మధ్యంతర సిఫార్సులు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరకపోతే ఐక్యంగా ఉద్యమించాలి.

ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి