గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన: పదేళ్ల దాకా ఏం కాదన్నారు.. 4 రోజులకే కుప్పకూలింది

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన: పదేళ్ల దాకా ఏం కాదన్నారు.. 4 రోజులకే కుప్పకూలింది

గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో బాధ్యులైన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో  బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, టికెట్ కలెక్టర్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 141 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే.. ఒరేవా కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆ వంతెన కేవలం 125 మంది సామర్థ్యాన్ని తట్టుకోగలదు. కానీ, ప్రమాద సమయంలో దానిపై 500 మంది వరకూ ఉన్నారని అధికారులు తెలిపారు.

మోర్బీ బ్రిడ్జి బాధ్యతలు ఒరేవా కంపెనీకి అప్పగింత

బ్రిటిష్ హయాంలో నిర్మించిన మోర్బీ బ్రిడ్జి పునరుద్ధరణ బాధ్యతలను ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఒరేవా కంపెనీకి అప్పజెప్పింది. ఒప్పందంలో భాగంగా ఒరేవా కంపెనీ వచ్చే15 ఏళ్ల పాటు కేబుల్ బ్రిడ్జి నిర్వహణ, మరమ్మతు బాధ్యతలను చూడనుంది. ఈ ఏడాది మార్చిలో బ్రిడ్జి  రిపేరింగ్ ను చేపట్టిన సదరు కంపెనీ... రిపేరింగ్ లో భాగంగా బ్రిడ్జిని మూసివేసింది. మరమ్మతు కోసం ఒరేవా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 8 నుంచి 12 నెలలు గడువు ఇచ్చింది. అయితే సదరు కంపెనీ మాత్రం బ్రిడ్జి మరమ్మతును హడావుడిగా పూర్తి చేసి 7 నెలలు కూడా గడవకముందే ఈ నెల 26న పున:ప్రారంభించింది.

బ్రిడ్జి ప్రారంభ సమయంలో మాట్లాడిన కంపెనీ ఎండీ జై సుఖ్ భాయ్ పటేల్.. రూ.2 కోట్లతో బ్రిడ్జి మరమ్మతును చేపట్టామని, వచ్చే పదేళ్ల వరకు బ్రిడ్జికి ఎలాంటి సమస్యలు రావని మీడియా సాక్షిగా చెప్పారు. ఈ నెల 26న బ్రిడ్జిని ప్రారంభించిన  సదరు కంపెనీ.. సందర్శన కోసం రూ.12, రూ.17 టికెట్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే దాదాపు 500 మంది బ్రిడ్జి సందర్శనకు వచ్చారు.పెద్ద ఎత్తున విజిటర్స్ రావడంతో అధిక బరువు వల్ల బ్రిడ్జి కూలిపోయి సందర్శకులు కింద ఉన్న చెరువులో పడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 141 మంది చనిపోగా.. 100 మందికి పైగా గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 

140 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జి

తీగల సాయంతో వేలాడే మోర్బీ సస్పెన్షన్‌ బ్రిడ్జి 140 ఏళ్ల నాటిది! 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి. వంతెన పొడవు 765 అడుగులు (233 మీటర్లు). వెడల్పు 1.25 మీటర్లు.  దీని నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇంగ్లండ్‌ నుంచి తెప్పించారు. నాటి మోర్బీ పాలకుడు సర్‌ వాగ్జీ ఠాకూర్‌ అప్పట్లో యూరప్‌లో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాన్ని రంగరించి దీన్ని కట్టించాడు. ఇది మోర్బీ పట్టణంలోని దర్బార్‌గఢ్, నజార్‌బాగ్‌ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి కాంట్రాక్టును దక్కించుకున్న ఒరేవా కంపెనీ.. 2037 వరకు టికెట్లను విక్రయించనుంది. టికెట్ల ధరలను ప్రతిఏడాది పెంచుకునేందుకు కూడా ఈ కంపెనీకి అనుమతి ఉన్నట్లు సమాచారం.