టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ.. రూ.50 లక్షలతో పరార్ .. 9 మంది అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ.. రూ.50 లక్షలతో పరార్ .. 9 మంది అరెస్ట్

మలక్ పేట, వెలుగు: టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి, ఓ ట్రస్ట్ నిర్వాహకుడి వద్ద రూ.50 లక్షలతో ఉడాయించిన కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు మలక్ పేట సీఐ నరేశ్​తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు.  మంచిర్యాలకు చెందిన విజయకుమార్ సేవారత్ ట్రస్ట్​నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని వద్దకు ఓ కంపెనీ ప్రతినిధులమని పేర్కొంటూ నరేందర్, శ్రీకాంత్ వచ్చారు. సీఎస్సార్​ఫండ్ కింద మీ అకౌంట్ లో రూ.కోటి జమ చేస్తామని దానికి ప్రతిఫలంగా తమకు రూ.50 లక్షలు ఇవ్వాలని చెప్పారు. వారి మాటలను నమ్మిన విజయ్ కుమార్ ఈ నెల 4న రాత్రి ముసారాంబాగ్ లోని తన బంధువు రామచంద్రయ్య ఇంట్లో రూ.50 లక్షలు ఇచ్చాడు. తర్వాత మాట్లాడుతుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు టాస్క్ ఫోర్స్ పోలీసులమని వచ్చారు. 

అక్కడున్నవారిని బెదిరించి, ఆ డబ్బులు తీసుకొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ నరేశ్​కేసు నమోదు చేశారు.  మలక్ పేట పోలీసులు, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి, సీసీటీవీ ఫుటేజీ, నిందితుల కాల్ డేటా పరిశీలించారు. 9 మంది నిందితులు ఓల్డ్ బోయిన్​పల్లి చెందిన ఔషధ వ్యాపారి రవీందర్ గౌడ్, విశాఖపట్నంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈగల రమణ, సికింద్రాబాద్ చెందిన ప్రైవేట్ ఉద్యోగి కొల్లి లింకన్ బాబు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి పిన్నింటి నవీన్ రెడ్డి, ఈది బజార్ కు చెందిన సయ్యద్ దస్తగిర్ ఖాద్రీ, బోయిన్​పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ గజ్జెల్లి విజయ్ చంద్ర, మాదన్నపేటకు చెందిన ప్రైవేట్​ఉద్యోగి దర్శనం మురళి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రైవేట్​ ఉద్యోగి అశోక్ గౌడ్, సైదాబాద్ కు చెందిన ర్యాపిడో డ్రైవర్ ఆవుల రామును మంగళవారం అరెస్ట్​చేశారు. వారి వద్ద నుంచి రూ.6.94 లక్షలు, 8 ఫోన్లు, 3 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు. మోహన్ ఎలియాస్ వాహిద్, సమీర్, ఆయాజ్ దేశ్​ముఖ్, సాహిల్ పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు.