
ఖమ్మం టౌన్/తల్లాడ, వెలుగు : ఖమ్మం కమిషనరేట్ పరిధిలోవివిధ కేసుల్లో పట్టుబడి, సీజ్ చేసిన90.706 కేజీల ఎండుగంజాయిని తల్లాడ మండలం నరసరావుపేట సమీపంలో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ బయోపిక్ బర్నింగ్ ప్లాంట్ లో శనివారం దహనం చేశారు. ఖమ్మం వన్ టౌన్, త్రీ టౌన్ ఖమ్మం రూరల్, ఖానాపురం హావేలి, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వైరా,తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, వీఎం బంజర, ఏన్కూర్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 17 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవి తెలిపారు. జిల్లా పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని కేంద్ర, -రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా నిర్వీర్యం చేశామన్నారు. సీసీఆర్పీ సీఐ స్వామి, తల్లాడ ఎస్సై కొండలరావు ఉన్నారు.