రిజర్వాయర్లున్నయి.. కానీ నీళ్లే లేవు

రిజర్వాయర్లున్నయి.. కానీ నీళ్లే లేవు

భూమి.. మూడు వంతుల నీరు, ఒక వంతు నేల ఉన్న గ్రహం. కానీ అందులో తాగడానికి పనికొచ్చేది కేవలం 3 శాతం మాత్రమే. మిగతా 97 శాతం ఉప్పు నీరు. ఈ 3 శాతం మంచి నీటిలో నదులు, సరస్సులు, భూగర్భ జలాల ద్వారా మనకు ఒక శాతం నీళ్లు మాత్రమే అందుతాయి. ఈ గణాంకాలు.. నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో చెప్పకనే చెబుతున్నాయి. కానీ వృథా ఆగడం లేదు. వాటర్ మేనేజ్​మెంట్​చేపట్టడం లేదు. వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తగ్గిపోతున్న అడవులు.. ఇంకెన్నో కారణాలతో వానలు కరువైపోయి ఎండలు మాత్రమే ‘కురుస్తున్నాయి’. దీంతో ప్రపంచం గొంతెండుతోంది. మనదేశంలోనూ ఇదే పరిస్థితి. రుతుపవనాలు నై నై అంటున్నాయి. వానలు రావడం లేదు. రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి.

10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..

ఈ సీజన్​లో ఇప్పటి వరకు 35 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో దేశంలో 44 శాతం ప్రాంతం కరువు అంచున నిలిచింది. దేశంలోని 91 ముఖ్యమైన రిజర్వాయర్లలో నీటి మట్టాలు చాలా కనిష్ట స్థాయికి చేరాయని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇటీవల తన రిపోర్టులో వెల్లడించింది. అలాగే పశ్చిమ, దక్షిణాది రాష్ర్టాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశంలోని చాలా రిజర్వాయర్ల నీటి మట్టాలు 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్​లోని రిజర్వాయర్లలో 83 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత మహారాష్ర్టలో 71 శాతం తక్కువగా ఉన్నట్లు చెప్పింది.

సూరత్: ధరోయ్

సూరత్​తోపాటు దక్షిణ గుజరాత్​లోని చాలా సిటీలకు ధరోయ్ రిజర్వాయర్ నుంచే నీళ్లందుతాయి. కానీ ప్రస్తుతం అక్కడ 8 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. గత పదేళ్లతో పోలిస్తే సగటున 77 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి.

ముంబై: అప్పర్ వైతర్ణ, భత్స

దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నీటిని అందించే రెండు రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. అప్పర్ వైతర్న రిజర్వాయర్​లో ప్రస్తుతం 8 శాతం నీళ్లున్నాయి. గతేడాది ఇదే సమయంలో 27 శాతం ఉన్నాయి. ఇక భత్స రిజర్వాయర్​లో 24 శాతం నీళ్లు మాత్రమే ఉన్నాయి. గత పదేళ్లలో జూన్​లో సగటున 31 శాతం నీళ్లు ఉండేవి. అలాంటిది జులైలో కూడా చాలా తక్కువ స్థాయిలో వాటర్ లెవల్స్ ఉన్నాయి. ఇటీవలి వర్షాలతో ఈ ప్రాజెక్టులకు మళ్లీ జలకళ వస్తుందని భావిస్తున్నారు.

చెన్నై: పుఝల్

దేశంలో నీటి కొరతతో వార్తల్లో నిలిచిన నగరం చెన్నై. చెన్నైకి నీళ్లిచ్చే పుఝల్ రిజర్వాయర్ ఎండిపోయింది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. రిజర్వాయర్​ఎప్పుడూ పూర్తిగా నిండదు. అనుకున్నంత మేర వర్షాలు పడకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నాలుగేళ్ల కిందట భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన మద్రాసు.. ఇప్పడిలా నీటి కటకటతో అల్లాడుతుండటం గమనార్హం.

బెంగళూరు: తిప్పగొండనహళ్లి..

వెస్ట్రన్ బెంగళూరు తాగు నీటిని సరఫరా చేసే రిజర్వాయర్ ‘తిప్పగొండనహళ్లి’. ప్రస్తు తం నీటి మట్టాలు పడిపోయాయి. చివరిసారిగా 1988లో ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ‘తిప్పగొండనహళ్లి’కి ఈ పరిస్థితి.