- దొంగ నుంచి 9.5 తులాల బంగారం, రెండు బైకులు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి
నార్కట్‌పల్లి, వెలుగు: జల్సాలకు అలవాటై ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ బంగారం, బైకులను ఎత్తుకెళ్తున్న నిందితుడిని నార్కట్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన బొలుగూరి శివ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల18న నార్కట్‌పల్లి మండల పరిధిలోని దాసరిగూడ గ్రామానికి చెందిన ఉప్పల సునీత ఒంటరిగా తన పొలం దగ్గరికి వెళుతుండగా.. బైక్ పై వచ్చిన శివ ఆమెకు మాయమాటలు చెప్పి మెడలో బంగారాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు.
ఆమె ప్రతిఘటించి బంగారాన్ని గట్టిగా పట్టుకొని కేకలు వేసింది. అటుగా వెళుతున్న పోలగాని సైదులు, ఉప్పల మోహన్ రెడ్డి గుర్తించి వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. ఎస్సై క్రాంతి కుమార్ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు జల్సాలకు అలవాటై దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
నల్గొండ రూరల్ మండలంలోని మీరుగూడెంలో, చర్లపల్లి, మునుగోడు మండలంలోని కల్వలపల్లి, నార్కట్ పల్లి మండలంలోని చెరువుగట్టు జాతరలో, పోతినేనిపల్లి గ్రామంలో దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడి నుంచి 9.5 తులాల బంగారం, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ. 15 లక్షలకు పైగా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. కేసును దర్యాప్తు చేసిన సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతి కుమార్, ఏఎస్ఐ ఆంజనేయులు, సత్యనారాయణ, గిరిబాబు, జవహర్, రమేశ్, జానీ పాషా, కృష్ణ, సురేశ్ గౌడ్ లను ఎస్పీ శరత్ చంద్ర అభినందించారు.
