‘థింకర్​బెల్ ల్యాబ్స్​’కు బ్రాండ్​ అంబాసిడర్.. ఈ బాలుడు​

‘థింకర్​బెల్ ల్యాబ్స్​’కు బ్రాండ్​ అంబాసిడర్.. ఈ బాలుడు​

చూపు లేకపోయినా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చిన్నవయసులోనే సోషల్​మీడియాలో పాపులర్​ అయ్యాడు ఇతను. రెండు రోజుల క్రితం గుజరాత్​లోని గాంధీనగర్​లో మొదలైన డిజిటల్ ఇండియా వీక్–​‌‌‌‌2022 ఎగ్జిబిషన్​లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు. ప్రధాని మోడీకి తమ కంపెనీ ప్రొడక్ట్ గురించి వివరించి శెభాష్​ అనిపించుకున్నాడు. పేరు ప్రథమేష్​ సిన్హా.  పదకొండేండ్ల వయసులోనే  ‘థింకర్​బెల్ ల్యాబ్స్​’ అనే కంపెనీకి బ్రాండ్​ అంబాసిడర్​ అయిన ఇతని గురించి... 

ఎగ్జిబిషన్​లో ‘యాన్నీ’ అనే ఎలక్ట్రానిక్ డివైజ్​ని ప్రదర్శనకు పెట్టాడు ప్రథమేష్. ఏమాత్రం తడబడకుండా ప్రధాని మోడీకి  ఆ డివైజ్ ఎలా పనిచేస్తుంది? ఎలా ఉపయోగించాలి? అనేది వివరించాడు. ప్రథమేష్​ చెప్తున్నంత సేపు మోడీ  ఆసక్తిగా వినడమే కాకుండా... ఆ తరువాత వెన్నుతట్టి మెచ్చుకున్నారు కూడా. అంతేకాదు ‘ఆ అబ్బాయిని చూశాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని ప్రధాని చెప్పడం విశేషం. ‘యాన్నీ’ డివైజ్​.. ప్రపంచంలోనే సొంతంగా బ్రెయిలీ భాష నేర్చుకునేందుకు ఉపయోగపడే మొదటి ఎలక్ట్రానిక్ డివైజ్. దీన్ని 2016లో బెంగళూరుకు చెందిన స్టార్టప్​ కంపెనీ ‘థింకర్​బెల్ ల్యాబ్స్’ తయారుచేసింది. 

ఈ డివైజ్ సాయంతోనే..

ప్రథమేష్ వాళ్లది పూనే.​  తండ్రి పేరు అశుతోష్​ సిన్హా, అమ్మ పేరు శిఖా సిన్హా. వీళ్లకు బేకరీ ఉంది.  పుట్టుకతోనే చూపు లేకపోవడంతో 16 నెలల వయసులో ఆపరేషన్​ కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు పేరెంట్స్. అన్ని పరీక్షలు చేశాక  ‘మీ అబ్బాయికి చూపు తెప్పించడం చాలా కష్టం’ అన్నారు డాక్టర్లు. దాంతో ‘కొడుకు జీవితాంతం చూపులేకుండా బతకాల్సిందేనా’ అని చాలా బాధపడ్డారు. అయితేనేం, తమ బిడ్డ అందరిలా అన్ని విషయాలు నేర్చుకోవాలి అనుకున్నారు. బ్రెయిలీ లిపి నేర్చుకునేందుకు ‘యాన్నీ’ డివైజ్ కొనిచ్చారు. అప్పటినుంచి అదే అతని బెస్ట్​ ఫ్రెండ్. ఆ మెషిన్​​ సాయంతోనే చదవడం, రాయడంతో పాటు టైపింగ్, కొత్త పదాల్ని కూడా నేర్చుకున్నాడు ప్రథమేష్​. ఎప్పుడూ పాజిటివ్​గా ఉండే అతడిని ‘యాన్నీ’ డివైజ్​లను తయారుచేసే ‘థింకర్​బెల్ ల్యాబ్స్’ తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్​గా చేసింది. 

షార్క్​ ట్యాంక్​ షోతో ఫేమస్​ 

స్టార్టప్ ఐడియాతో వచ్చిన వాళ్లకు తమ కలని నిజం చేసుకునే అవకాశం ఇచ్చే ‘షార్క్​ట్యాంక్ ఇండియా  షో’ ప్రథమేష్​ జీవితాన్ని మార్చేసింది. అదెలాగంటే... ఆ షో లో స్టార్టప్​ కంపెనీగా ‘థింకర్​బెల్​ ల్యాబ్స్’  తెచ్చిన ‘యాన్నీ’ డివైజ్ గురించి అతను వివరించిన తీరుకు షార్క్​ట్యాంక్ కో–ఫౌండర్  అమన్ గుప్తా ఫిదా అయ్యాడు. తన కంపెనీ ‘బోట్ ఇండియా’ ఆఫీసుకు పిలిపించుకొని  ప్రథమేష్​కి ఒకరోజు సీఇవోగా అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, అతని చదువు కోసం ‘స్పెషల్ నీడ్స్ ఇన్​స్ట్రక్టర్’ స్కాలర్​షిప్​ కూడా అందజేశాడు. ప్రస్తుతం పూనేలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదో క్లాస్ చదువుతున్నాడు ప్రథమేష్​. ఒకపక్క చదువుకుంటూనే థింకర్​​బెల్ ల్యాబ్స్ అంబాసిడర్​గా నెలకు పాతికవేల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఐఎఎస్ లేదా మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనేది తన డ్రీమ్ అంటున్న  ప్రథమేష్​కి పాటలు పాడడం, డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం.