లింగంపేట శివారులో ఎలుగుబంటి సంచారం

లింగంపేట శివారులో ఎలుగుబంటి సంచారం

లింగంపేట, వెలుగు:  కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ శివారులో మత్తడిపోచమ్మ ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.  ఏటా ఉగాది పర్వదినం మొదలుకొని ఐదు రోజుల పాటు మత్తడిపోచమ్మ జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు ముగిసిన నాటి నుంచి నెలరోజుల పాటు ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. 

ఈ క్రమంలో మంగళవారం లింగంపేట, ఐలాపూర్ గ్రామాలకు చెందిన పలువురు భక్తులు​ అమ్మవారిని దర్శనం చేసుకుని ఇండ్లకు వెళ్తుండగా ఆలయ సమీపంలో రోడ్డుపై ఎలుగుబంటి కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు.  భక్తులు గట్టిగా అరవడంతో ఎలుగుబంటి సమీపంలోని గుట్ట పైకి పారిపోయిందని తెలిపారు. మత్తడి పోచమ్మ ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచరించడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్టు ఆఫీసర్లు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు.