
- పుస్తకావిష్కరణకు హాజరైన ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- టెర్రరిజం.. ప్రపంచానికే ముప్పు: జగదీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ, వెలుగు: ఇండియాతో పాటు యావత్ ప్రపంచానికి టెర్రరిజం పెను ముప్పు అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రధాని మోదీ వెంట దేశ ప్రజలంతా ఉన్నారని వెల్లడించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ హిందీ అనువాదం ‘జనతాకీ కహానీ- మేరీ ఆత్మకథ’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల్లో కుల, మతాలకు అతీతంగా అందరూ దత్తాత్రేయను అభిమానిస్తారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి బీజేపీలో వివిధ బాధ్యతలను నిర్వర్తించి ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా ఎదిగిన దత్తాత్రేయ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయ పని చేశారని గుర్తు చేశారు.
ఆ తర్వాత మోదీ కేబినెట్లోనూ పనిచేశారన్నారు. దత్తాత్రేయ జీవితం యువ రాజకీయ నాయకులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. తన రాజకీయ జీవితం కూడా దత్తాత్రేయ చేతుల మీదుగా ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఆయన 4 సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అర్జున్‌రామ్ మేఘ్వాల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.