
ఖానాపూర్, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బంధువులు తెలిపిన ప్రకారం.. ఖానాపూర్ టౌన్ కు చెందిన అనిత, రాజు దంపతుల కొడుకు అయాన్ (18 నెలలు)కు తీవ్ర జర్వం రావడంతో 4 రోజుల కింద స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచుకొని ట్రీట్ మెంట్ చేస్తున్నా.. కానీ.. బాలుడికి తగ్గకపోవడంతో నిర్మల్ లోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ కూడా బాలుడికి ట్రీట్ మెంట్ చేయించి, మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో బాలుడు చనిపోయాడు. ఖానాపూర్ టౌన్ లోని ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు చేసిన ఇంజక్షన్లు వికటించడంతోనే తమ బాబు చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళవారం కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా తరలివెళ్లి ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం తెలియడంతో ఎస్ఐ రాహుల్ సిబ్బందితో వెళ్లి మాట్లాడి గొడవను సద్దుమణిగించారు.