రామగుండం ఎన్టీపీసీ టౌన్‌‌షిప్‌‌లో దారుణం..రూ. 100 కోసం గొడవ.. అడ్డుకున్న వ్యక్తి హత్య

రామగుండం ఎన్టీపీసీ టౌన్‌‌షిప్‌‌లో దారుణం..రూ. 100 కోసం గొడవ.. అడ్డుకున్న వ్యక్తి హత్య

జ్యోతినగర్, వెలుగు : రూ. 100 కోసం ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుండడంతో అడ్డుకున్న మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రామగుండం ఎన్టీపీసీ టౌన్‌‌షిప్‌‌లో గురువారం జరిగింది. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌‌కిరణ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... రామగుండం ఎన్టీపీసీ టౌన్‌‌షిప్‌‌లో గుప్తా కన్‌‌స్ట్రక్షన్స్‌‌ కంపెనీ ఆధ్వర్యంలో క్వార్టర్లు, బిల్డింగ్‌‌లు నిర్మిస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌‌ జిల్లాకు చెందిన వినోద్‌‌ సోన్కర్‌‌ (44), మనోజ్‌‌ సాంగే, నీలకంఠతో పాటు పలువురు ఇక్కడ పనిచేస్తూ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెల్లో ఉంటున్నారు. మనోజ్‌‌ అనే వ్యక్తి నీలకంఠకు బుధవారం ఉదయం రూ.300 ఇచ్చాడు.

సాయంత్రం నీలకంఠ రూ. 200 మాత్రమే తిరిగి ఇవ్వడంతో మిగిలిన రూ.100 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గమనించిన వినోద్‌‌ సోన్కర్‌‌ గొడవ పడొద్దని ఇద్దరికీ నచ్చజెప్పాడు. తర్వాత ఎవరికి వారు వెళ్లిపోయి పడుకున్నారు. అయితే వినోద్‌‌పై కోపం పెంచుకున్న మనోజ్‌‌.. బుధవారం అర్ధరాత్రి ఇనుపరాడ్‌‌తో దాడి చేసి పరార్‌‌ అయ్యాడు. గురువారం ఉదయం మిగతా కార్మికులు వినోద్‌‌ను లేపేందుకు వెళ్లగా రక్తపుమడుగులో పడి కనిపించాడు. వెంటనే గోదావరిఖని గవర్నమెంట్‌‌ ఏరియా హాస్పిటల్‌‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య ప్రతిభ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌‌కిరణ్‌‌ తెలిపారు.