బావిలో పడ్డ కారు...రెండు కుటుంబాల్లో తీరని విషాదం  

బావిలో పడ్డ కారు...రెండు కుటుంబాల్లో తీరని విషాదం  

నలుగురు మృతి.. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన టెన్త్ పిల్లలు 
మృతుల్లో భార్యాభర్తలు, తల్లీ కొడుకులు .. రెండు కుటుంబాల్లో తీరని విషాదం  
మహబూబాబాద్ జిల్లాలో ప్రమాదం 

మహబూబాబాద్ / నెల్లికుదురు :  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం సాయంత్రం కారు బావిలో పడి రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృతిచెందారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దర్గా షరీఫ్​ నుంచి కేసముద్రం వైపు వెళ్తున్న కారు బైపాస్ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలోకి దూసుకెళ్లింది. వెంటనే డ్రైవర్​ డోరు తీసుకొని బయటకు రాగా, అక్కడే ఉన్న ఇద్దరు టెన్త్ విద్యార్థులు ప్రాణాలకు తెగించి కారులోని మరో ఇద్దరిని కాపాడారు. ఈలోగా కారు మునిగిపోవడంతో అందులోని నలుగురు చనిపోయారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గోల్యా తండాకు చెందిన బానోత్ భద్రు(39), ఆయన భార్య బానోత్ హచ్చాలి(35), బంధువులు మాలోత్ సుమలత, ఆమె కొడుకు మాలోత్ దీక్షిత్, కారు (నెక్సా టీఎస్28ఎల్7299) డ్రైవర్ కమ్ ఓనర్ గుగులోత్ బిక్కు కలిసి అన్నారం దర్గా షరీఫ్ లో బంధువులు చేసిన కందూరుకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వీరి బంధువులు మహబూబాబాద్ పట్టణానికి చెందిన గుగులోత్ లలిత(45), ఆమె కొడుకు గుగులోత్ సురేష్(14) కూడా కారులో ఎక్కారు. మొత్తం ఏడుగురు కారులో బయలుదేరారు. 

స్పీడ్ గా వచ్చి.. అదుపుతప్పి.. 

సాయంత్రం 6.40 గంటల టైంలో కేసముద్రం బైపాస్ వద్దకు రాగానే స్పీడ్​గా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. డ్రైవర్ బిక్కు డోరు తీసుకొని బయటకు వచ్చాడు. కారు బావిలో పడటం చూసిన ఇద్దరు విద్యార్థులు సిద్దూ, రంజిత్​వెంటనే బావిలోకి దూకారు. కారు అద్దాలు పగులగొట్టి మాలోత్  సుమలత, మాలోత్ దీక్షిత్​ను బయటకు తీసుకువచ్చారు. మిగతా వాళ్లను కాపాడే ప్రయత్నం చేసేలోపే కారు మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న నలుగురు మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సాయంతో కారును పైకి తీశారు. మృతదేహాలను పోస్ట్​మార్టం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కాగా, బానోత్ భద్రు లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, గుగులోత్ లలిత మహబూబాబాద్ లోని యూనియన్ బ్యాంకులో అటెండర్ గా పని చేస్తోందని పోలీసులు చెప్పారు. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడిన విద్యార్థులు కేసముద్రంలోని వివేకానంద స్కూల్​లో పదో తరగతి చదువుతున్నారని తెలిపారు.