ఎంఎన్ఎస్‌ చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు

ఎంఎన్ఎస్‌ చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు

ముంబై : మహారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన (ఎంఎన్ఎస్‌) చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు నమోదైంది. ఔరంగాబాద్‌లో ఆదివారం (ఈనెల 1వ తేదీన) జరిగిన ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదైంది. ఔరంగాబాద్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ర్యాలీ నిర్వాహకుల పేర్లను కూడా చేర్చారు. అల్లర్లు సృష్టించేలా ఘర్షణలకు దారితీసేలా వ్యాఖ్యలు చేశారని రాజ్‌ ఠాక్రేపై అభియోగాలు మోపారు. లౌడ్‌ స్పీకర్ల వివాదం నేపథ్యంలో ముంబైలోని రాజ్ ఠాక్రే నివాసం ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. మ‌సీదుల్లో లౌడ్‌ స్పీక‌ర్ల‌ను తొల‌గించాల‌ని ఇంతకుముందు ఉద్ధ‌వ్ ఠాక్రే స‌ర్కార్‌కు రాజ్ ఠాక్రే అల్టిమేటం జారీ చేశారు. 

మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను ఈ నెల 3వ తేదీలోపు తొలగించాలని లేదంటే 4వ తేదీ నుంచి తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆఘాడి ప్రభుత్వానికి రాజ్‌ఠాక్రే అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ లౌడ్‌ స్పీకర్లు తొలగించకుంటే మసీదుల ముందు డబుల్‌ సౌండ్‌తో హనుమాన్‌ చాలీసా ప్లే చేస్తామని హెచ్చరించారు. ఈనెల 4 త‌ర్వాత తాము ఎవ‌రేం చెప్పినా వినిపించుకోమ‌న్నారు.