
కాకినాడ: రెండు రూపాయిల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో జరిగింది. గ్రామానికి చెందిన రేవు సువర్ణరాజు అనే యువకుడు తన సైకిల్ టైరుకు గాలికొట్టించుకొనేందుకు సైకిల్ షాపు కి వెళ్లాడు. గాలి కొట్టించుకున్నందుకు షాపు యజమాని సాంబ రూ.2 రూపాయలు ఇవ్వమని అడగ్గా.. తన దగ్గర లేవని దురుసుగా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ కాగా.. అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు సువర్ణరాజును కత్తితో పొడిచాడని స్థానికులు తెలిపారు. బాధితుడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందాడని వైద్యులు తెలిపారు.