బీజేపీ వాళ్లు నాపై కత్తులతో దాడికి దిగారు: కాంతి ఖరాడి 

  బీజేపీ వాళ్లు నాపై కత్తులతో దాడికి దిగారు: కాంతి ఖరాడి 

రీఎలక్షన్​ పెట్టాలని గుజరాత్ కాంగ్రెస్​ అభ్యర్థి డిమాండ్

అహ్మదాబాద్: బీజేపీ వాళ్లు తనపై కత్తులతో దాడిచేయడంతో అడవిలోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని గుజరాత్​కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఆరోపించారు. గుజరాత్​లో కాంగ్రెస్​ గిరిజన నేత, తమ పార్టీ అభ్యర్థి కాంతి ఖరాడిపై బీజేపీ గుండాలు దాడికి దిగడంతో అతను కనిపించకుండా పోయాడని ఆదివారం అర్ధరాత్రి రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బనస్కాంతా జిల్లాలోని దాంత నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖరాడి సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఓటర్లను కలిసేందుకు కారులో వెళ్తుండగా.. రాత్రి 9:30 గంటల టైమ్​లో బీజేపీ అభ్యర్థి, అతని అనుచరులు 150 మంది అడ్డగించి కత్తులతో దాడికి దిగారు.

ప్రాణాలు దక్కించుకునేందుకు నేను పదిపదిహేను కిలోమీటర్లు పరిగెత్తి పారిపోయి అడవిలో దాక్కున్నాను. మూడునాలుగు గంటల తర్వాత నన్ను గుర్తించిన పోలీసులు ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందించారు” అని అన్నారు. మా కారును అడ్డగించగానే వెనక్కి తిప్పి తప్పించుకోవాలనుకున్నాం, కానీ మరో కారును అడ్డంగా పెట్టడంతో వెహికల్ దిగి అడవిలోకి పారిపోయామని చెప్పారు. దాడికి కొద్ది రోజులు ముందు నుంచే తనకు బెదిరింపులు వస్తున్నాయని.. ఆ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి భద్రతపెంచాలని కోరానని చెప్పారు. అయితే ఈసీ తన వినతిని పట్టించుకోలేదన్నారు. దాంత సీటులో రీఎలక్షన్​ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థి లడ్డూ పరిగిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే ఖరాడి ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు.