- 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్’ పేరిట లేపేసే ప్లాన్: మంత్రి పొంగులేటి
ఖమ్మం, వెలుగు: ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెర లేపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘సర్’ పేరుతో 30 నుంచి 35 శాతం ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందన్నారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఖమ్మం, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ శిబిరం ఏదులాపురంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరై మాట్లాడారు.
ఓటరు వయసులో స్వల్ప తేడాలున్నా, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా.. వాటిని సాకుగా చూపి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని.. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలన్నారు. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ‘ఓట్ మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
ఉద్యోగాలు, చదువుల రీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లలో ఉండే మన వాళ్లు అధికారులు వచ్చినప్పుడు ఊర్లో లేరనే సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని, అధికారులు వచ్చే ముందే గ్రామంలో చాటింపు వేయించి వేరే ఊర్లలో ఉన్న మన ఓటర్లను రప్పించి ఓటు కాపాడుకోవాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు. ఒక పాత కేసును సాకుగా చూపి ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరింపజేశారని, కాంగ్రెస్ కు దక్కాల్సిన ఆ స్థానాన్ని చోరీ చేశారని మంత్రి మండిపడ్డారు.
తర్వాత రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. నెలకొండపల్లి మండలంలో రూ.2 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు తిరుమలాయపాలెం సబ్ స్టేషన్లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 0.8 మెగావాట్లు సోలార్ పవర్ ప్లాంట్ కు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
