ప్రధాని నివాసం వద్ద డ్రోన్ కలకలం.. మోదీ భద్రతలో మరోసారి లోపం

ప్రధాని నివాసం వద్ద డ్రోన్ కలకలం.. మోదీ భద్రతలో మరోసారి లోపం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద ఓ డ్రోన్‌ కలకలం రేపింది. సోమవారం (జులై 3వ తేదీ) తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల సమయంలో  ఓ అనుమానాస్పద డ్రోన్‌ ప్రధాని మోదీ నివాసంపై సంచరించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) వెంటనే అలర్ట్ అయ్యింది. ఇటు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. ప్రస్తుతం దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. 

ఢిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని మోదీ అధికారిక నివాసం ఉంది. సాధారణంగా ప్రధాని నివాసం వద్ద నో-ఫ్లై జోన్‌ అమల్లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి డ్రోన్‌ రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి డ్రోన్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. 

డ్రోన్ సంచరించేప్పుడు ప్రధాని మోదీ ఇంట్లోనే ఉన్నారని భద్రతా సిబ్బంది తెలిపారు. ప్రధాని నివాసంపై పలుమార్లు డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు ఎస్పీజీ నుంచి సమాచారం అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద కూడా ఓ అనుమానాస్పద డ్రోన్ సంచరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కేజ్రీవాల్‌ నివాసం కూడా నో-ఫ్లై జోన్‌లోనే ఉంది.