- 200 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల ఓపీఎం పట్టివేత
- బాచుపల్లిలోనూ 12 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పేట్ బషీరాబాద్, బాచుపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడింది. రాజస్థాన్ నాగౌర్ జిల్లా ఖేడ్ నార్నోనియా గ్రామానికి చెందిన రాజేందర్(31) హైదరాబాద్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి నగరానికి వచ్చే కొంతమంది ఎండీఎంఏ, ఓపీఎం ఎక్కువగా వాడుతున్నట్లు గమనించి ఆ బిజినెస్‌లోకి దిగాడు.
రాజస్థాన్‌లోని ధన్‌రాజ్, అనీల్ మోహన్‌రామ్, ముఖేశ్‌జాట్, పునమ్ బిషోనాయ్ అలియాస్ విష్ణు నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా బుధవారం పేట్ బషీరాబాద్‌లోని అంగడిపేటలో అతడు ఉంటున్న ఇంటిపై ఈగల్ టీం, పేట్ బషీరాబాద్ పోలీసులు దాడులు చేశారు. రూ.15 లక్షల విలువైన 200 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల ఓపీఎం స్వాధీనం చేసుకున్నాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
బాచుపల్లిలో ముగ్గురు అరెస్ట్..
మల్లంపేట్‌లోని హైరైజ్ విల్లాస్‌లో నివాసముండే హర్ష(31) వద్ద డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. 1.12 గ్రాములు ఎండీఎంఏ దొరికింది. అంతేగాకుండా బెంగళూరుకు చెందిన నిన్జప్ప(32) బెంగళూర్ నుంచి ఎండీఎంఏ తీసుకువచ్చి హర్ష డ్రైవర్ చందు(21)కు ఇస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 11.34 గ్రాముల ఎండీఏంఏ స్వాధీనం చేసుకున్నారు.
