ఒకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు హీరోలు.. తల్లిపై అరవింద్ ఎమోషనల్ కామెంట్స్

ఒకే ఫ్రేమ్‌లో మెగా, అల్లు హీరోలు.. తల్లిపై అరవింద్ ఎమోషనల్ కామెంట్స్

దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అరవింద్ మాతృమూర్తి కనకరత్నం ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై అల్లు కనకరత్నం కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా, అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమె జీవితం ఎంతో గొప్పదని, చిరంజీవి వంటి అల్లుడిని, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ మనవలను చూసినందుకు ఆమె ఎంతో ఆనందించారని చెప్పారు. రెండు కుటుంబాల నుంచి వచ్చిన యువ నటుల విజయాన్ని చూసి ఆమె సంతోషించారని, అందుకే ఆమె తుది యాత్రను ఆనందంగా ముగించాలని తాము కోరుకున్నామని అరవింద్ వివరించారు.

అలాగే, అల్లు రామలింగయ్య, అల్లు కనకరత్నంల పెళ్లి కథను కూడా ఆయన పంచుకున్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ, కమ్యూనిస్ట్ భావజాలంతో జైలుకు వెళ్లిన అల్లు రామలింగయ్య, ఒకసారి రాట్నం వడుకుతున్న కనకరత్నంను చూసి ఆమెను ఇష్టపడ్డారని, వారిద్దరి పెళ్లికి ఆయనే తన తల్లిదండ్రులను పంపించి ఒప్పించారని తెలిపారు. 

ALSO READ : ‘మిరాయ్’ టికెట్ బుకింగ్స్ ఓపెన్..

అల్లు కనకరత్నం, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు. పవన్‌ను ఆమె 'కళ్యాణి' అని ముద్దుగా పిలిచేవారట. సినిమాలోకి రాకముందు పవన్‌ను చూసి "నువ్వు చాలా బాగున్నావు, ఎందుకు సినిమాల్లోకి రాకూడదు?" అని అడిగేవారని, అయితే పవన్ సిగ్గుతో దానికి అంగీకరించేవారు కాదని అరవింద్ చెప్పారు. అల్లు అరవింద్‌తో సైతం కళ్యాణితో సినిమా ఎందుకు తీయకూడదు? అని తన తల్లి అడిగేవారని, ఈ విషయాన్ని గతంలో పవన్ కళ్యాణే గుర్తుచేసుకున్నారని తెలిపారు.

ఈ వేడుకలో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఆ అరుదైన దృశ్యం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత ఈ ముగ్గురు స్టార్స్ ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.