ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ప్రజలు న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్​చేసుకున్నారు. యువతీయువకులు డ్యాన్స్​లు.. ఆటపాటలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికారు. ఒకరికొకరు విషెస్​ చెప్పుకున్నారు. మరోవైపు ఉదయం నుంచి లిక్కర్​షాపులు, బార్లు, స్వీట్​హౌస్​లు కిటకిటలాడాయి. కేక్​ల కోసం బేకరీల్లో జనం ఎగబడ్డారు.   

 - వెలుగు నెట్​వర్క్

లైన్​మన్ ​సతాయిస్తుండు

తిర్యాణి,వెలుగు: బిల్లులు కట్టాలని కరెంట్ లైన్​మన్ ఆదివాసీలను సతాయిస్తుండని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ ఆదరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సబ్ స్టేషన్​ను ముట్టడించారు. అమాయకులైన ఆదివాసీలను వేధించడం సరైంది కాదన్నారు. లైన్​మన్​ను తొలగించాలని డిమాండ్​చేశారు. లేదంటే జిల్లా కరెంట్​ఆఫీస్​ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. నిరసనలో లీడర్లు సారా రమేశ్ గౌడ్, పులి వెంకటేశ్, కనక హన్మంతరావు, కొట్నాక బారిక్ రావు తదితరులు ఉన్నారు.

నరేశ్​ కు మద్దతు తెలిపిన వ్యక్తికి దేహశుద్ధి

నర్సాపూర్(జి), వెలుగు: అయ్యప్పను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్​కు మద్దతుగా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టిన కుంటాల మండలం వెంకూర్ సర్పంచ్ శృతి తండ్రి మగ్గిడి దిగంబర్​పై శనివారం అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. హిందూ ధర్మాలను కించపరిచే విధంగా ఎవరు పోస్టులు పెట్టినా దాడులు తప్పవని హెచ్చరించారు. అయితే దిగంబర్ క్షమాపణ చెప్పడంతో అయ్యప్ప స్వాములు శాంతించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల నిరసన కొనసాగింది. బైరి నరేశ్​పై పీడీ యాక్ట్​నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. 

రాష్ట్ర స్థాయి సైన్స్​ ఫెయిర్​ను సక్సెస్​ చేయాలి

నిర్మల్, వెలుగు: రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ను నిర్మల్​లో నిర్వహించడం గర్వకారణమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్​లో స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్​నిర్వహణపై కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ, విద్యాశాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ను సక్సెస్ చేసేందుకు అందరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారన్నారు. జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు, గైడ్ టీచర్లకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. సైన్స్ ఫెయిర్ జరిగే మూడు రోజులపాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ అందుబాటులో ఉండాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైన్స్ ఫెయిర్​కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారు.  ఈనెల 7వ తేదీలోపు మోడల్ స్కూళ్ల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు.  సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు,  మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పంచాయతీరాజ్ ఆర్ అండ్ బీ ఆఫీసర్లు, డీఈవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 

శిశు మందిరాలు సంస్కృతికి నిలయాలు

ముథోల్,వెలుగు: సరస్వతీ శిశు మందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. శనివారం ముథోల్ శ్రీసరస్వతి శిశు మందిర్ హైస్కూల్​భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. శిశు మందిరాలు విద్యార్థులకు నాణ్యమైన విద్య, దేశ సంస్కృతిని పెంపొందిస్తాయన్నారు. స్థలదాత సీబీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి తన సంపదలో కనీసం ఒక్క శాతం సమాజ సేవకు ఖర్చుచేస్తే దొరికే ఆనందం అంతా ఇంతా కాదన్నారు. స్కూల్​నిర్మాణానికి ఎంపీ రూ.11 లక్షలు, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకండి రమాదేవి రూ.51 వేలు, అయ్యన్న గారి భూమయ్య రూ.25 వేలు, తాటివార్ రమేశ్ రూ.21 వేలు, భైంసా భజరంగ్​ వ్యాయామశాల కమిటీ రూ.5 వేలు, పూర్వాచార్యులు రామారావు రూ.5 వేలు, ఎంపీటీసీ సభ్యులు దేవోజి భూమేశ్​ రూ.5 వేలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటన్​కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, విద్యాభారతి దక్షిణ మధ్యక్షేత్ర సహ కార్యదర్శి వినోద్ కుమార్, ప్రాంత కార్యదర్శి ముక్కాల సీతారాములు, డాక్టర్ దామోదర్ రెడ్డి, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ప్రముఖ వైద్యుడు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లలో లాంగ్​వాల్​ ప్రాజెక్టుగా శాంతిఖని మైన్​ 

మందమర్రి​,వెలుగు: బెల్లంపల్లి శాంతిఖని మైన్​ను లాంగ్​వాల్ ప్రాజెక్టుగా మార్చేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంటోందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ చెప్పారు. శనివారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు డిసెంబర్​ నెలలో టార్గెట్​లో​ 95 శాతం సాధించినట్లు తెలిపారు. కేకే ఓసీపీలో 107 శాతం, కేకే1 గనిలో 105 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. ఇందులో ఎంప్లాయీస్​, ఆఫీసర్ల కృషి ఎంతో ఉందన్నారు. ఆర్కేపీ ఓసీపీ 93 శాతం, కేకే5 మైన్​ 75 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్కే-1ఏ, కేకే1 అండర్​ గ్రౌండ్​ బొగ్గు గనులు మూసివేస్తామన్నారు. కాసిపేట గనిలో 4 ఎస్డీఎల్ మిషన్స్, కాసిపేట1 గనిలో రెండు, శాంతిఖని గనిలో మూడు ఎస్డీఎల్​ మిషన్స్ ఏర్పాటులో జాప్యం కారణంగా బొగ్గు ఉత్పత్తి అనుకున్నస్థాయిలో జరగడంలేదన్నారు. 

లాంగ్​వాల్​తో శాంతిఖని గనికి ఉజ్వల భవిష్యత్...

 బెల్లంపల్లి శాంతిఖని గనిలో ఏర్పాటు చేసిన బోల్టర్​ మైనర్​ ద్వారా ఆశించిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరగడంలేదని, వచ్చే రెండేళ్లలో గనిని లాంగ్​వాల్​ ప్రాజెక్ట్​గా మార్చేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందన్నారు. దీంతో రోజుకు మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే చాన్స్​ఉందన్నారు. సమావేశంలో ఏరియా ఎస్​వోటు జీఎం సీహెచ్​కృష్ణారావు, కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ పీవోలు రమేశ్, మధుసూదన్, డీజీఎం ఐఈడీ రాజన్న, నర్సింహరాజు(వర్క్​షాప్), పర్సనల్​హెచ్​వోడీ శ్యాంసుందర్, సీనియర్ పీవో మైత్రేయబంధు తదితరులు పాల్గొన్నారు. 

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ప్రజాసమస్యలపై పోరాడే వారిని అరెస్టు చేసి ఉద్యమాలు ఆపలేరని పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత చెప్పారు. మద్యం షాపుల బంద్ నిర్వహించాలని కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఆమెను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి వరకు లిక్కర్​షాపులు తెరిచి ఉంచేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. అరెస్టు అయిన వారిలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేశ్​రెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్,ఉప సర్పంచ్ మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ రాజేశ్వర్, దండు మధూకర్, తుడం వినోద్, ఫహిం, గజానన్ ఉన్నారు.

సర్పంచుల సమస్యలు పరిష్కరించాలె

తిర్యాణి, వెలుగు: జిల్లాలోని ఆదివాసీ సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు రావడంలేదన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గుణవంతరావు, ఎంపీపీ అరిగెల నాగేశ్వరరావు, సర్పంచులు మధుకర్, జ్ఞానేశ్వర్ ఉన్నారు.

నీలగిరి చెట్ల నరికివేత నిలిపివేయాలి

జైపూర్(భీమారం),వెలుగు: భీమారం ప్లాంటేషన్​లోని నీలగిరి చెట్ల నరికివేత నిలిపివేయాలని వన సంరక్షణ సమితి సభ్యులు కోరారు. ఈమేరకు శనివారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగారు. ఫారెస్ట్ ఆఫీసర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెట్లను నరికి  రవాణా చేయడం దారుణమన్నారు. ఆధ్వర్యంలో పెంచిన చెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ సర్కార్ ను వివరణ కోరగా వన సంరక్షణ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నీలగిరి చెట్లు నాటింది వాస్తవమేనని, గవర్నమెంట్​రూల్స్​మేరకు చెట్లను నరికివేయిస్తున్నట్లు తెలిపారు. 

నెన్నెల తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలి

బెల్లంపల్లి,వెలుగు: నెన్నెల తహసీల్దార్ భూమేశ్వర్​ను సస్పెండ్​చేయాలని డిమాండ్​ చేస్తూ శనివారం బీజేపీ లీడర్లు ఆర్డీవో ఆఫీస్​ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్​బీఆర్ఎస్​ఏజెంట్​గా ​పనిచేస్తున్నాడని లీడర్లు ఆరోపించారు.  మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన నార పెంటక్క దంపతులు అన్ని పర్మిషన్లతో ఇంటి నిర్మాణం చేపడుతుంటే తహసీల్దార్ పిల్లర్లు కూలగొట్టించాడని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీశ్​ గౌడ్, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేష్,  నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ పేర్కొన్నారు. దీంతో పెంటక్క పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో శ్యామలాదేవికి వినతి పత్రం అందజేశారు. నిరసనలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరెడ్డి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజూలాల్ యాదవ్, దూది ప్రకాశ్, నెన్నెల సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సర్పంచులతో చర్చలు సఫలం

ఆసిఫాబాద్,వెలుగు: ప్రభుత్వం అభివృద్ధి కి సహకరించడం లేదని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు తమకు తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ కు​ రాజీనామా చేసిన వాంకిడి మండలానికి చెందిన 18 మంది సర్పంచులు రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. జడ్పీ చైర్​పర్సన్​ కోవ లక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే ఆత్రం సక్కు శనివారం వాంకిడికి వెళ్లి రాజీనామా చేసిన సర్పంచులతో చర్చించారు. సమస్యలుంటే  తమ దృష్టికి తీసుకురావాలని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్​ కాదన్నారు. సర్పంచుల సమస్యలు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాల్లో లింక్​ రోడ్లు,  తాగునీరు, ఇంటర్నల్ ​రోడ్స్, ​ఆదివాసీ భవన్ నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు తిరిగి ఖాతాల్లో వేయాలన్నారు. పంచాయతీలకు రావాల్సిన ఫండ్స్​ రెగ్యూలర్​గా ఇవ్వాలన్నారు. మండల కేంద్రంలో రూ. 21 లక్షలతో ఆదివాసీ భవన్ నిర్మాణం కోసం జడ్పీ చైర్ ​పర్సన్ ​కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్పా, ఆత్రం సక్కుతో కలిసి భూమి పూజ చేశారు. దీంతో సర్పంచులు తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.