ఆన్​లైన్ గేమ్స్​కు బానిసై  సూసైడ్

ఆన్​లైన్ గేమ్స్​కు బానిసై  సూసైడ్

హైదరాబాద్, వెలుగు: ఆన్​లైన్ గేమ్స్​కు బానిసై ఎన్ఎఫ్​సీ(న్యూక్లియర్ ఫ్ల్యుయల్ కాంప్లెక్స్) ఎంప్లాయ్ సూసైడ్ చేసుకున్న ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వరద శివ(31) సిటీకి వచ్చి ఈసీఐఎల్​లోని డీఈఏ కాలనీలో ఉంటూ ఎన్​ఎఫ్​సీలో జాబ్ చేస్తున్నాడు.  కొన్నేండ్ల కిందట అతడికి గద్వాల జిల్లాకు చెందిన మహంకాళి ప్రభాతతో పెళ్లైంది. వీరికి ఏడాదిన్నర బాబు వేదాంశ్ ఉన్నాడు. శివ ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై బెట్టింగ్ లు పెట్టి అప్పుల పాలయ్యాడు. ప్రభాత పేరెంట్స్ ఆ అప్పులను తీర్చి ఆన్ లైన్ గేమ్స్ మానుకోవాలని శివకు చెప్పారు. అయినప్పటికీ శివ మళ్లీ ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు.

ప్రభాత కొన్నిరోజులుగా పంటినొప్పితో బాధపడుతుండటంతో ఈ నెల 4న ఆమెతో పాటు బాబు వేదాంశ్​ను గద్వాల్​లోని పుట్టింటి దగ్గర వదిలిపెట్టిన శివ రాత్రి డీఈఏ కాలనీలోని ఇంటికి వచ్చాడు. మంగళవారం రాత్రి  బెడ్రూంలో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. బుధవారం ఉదయం కాలనీ సెక్యూరిటీ గార్డు కమలయ్య వచ్చి ఎన్నిసార్లు డోర్ కొట్టినా రెస్పాండ్ లేదు. డోర్ పగులగొట్టిన కమలయ్య లోపలికి వెళ్లి చూసేసరికి శివ ఉరేసుకుని కనిపించాడు. శివ భార్య ప్రభాతకు, కుటుంబసభ్యులకు, పోలీసులకు కాలనీ వాసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్​ను గుర్తించి సీజ్ చేశారు. ‘ సారీ వేదాంశ్.. నీ కోసం ఏమీ చేయలేకపో తున్నా.. నా బ్రెయిన్ కంట్రోల్ చేయలేకపోతున్న.. నా చావుకు నేనే కారణం.. సారీ టు ఆల్..    నా ముందు వేరే దారులు లేవు.  అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా..’ అని సూసైడ్ నోట్​లో ఉందని పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.