ఏసీబీ అధికారినంటూ వసూళ్లు.. గవర్నమెంట్ ఆఫీసర్లే టార్గెట్

ఏసీబీ అధికారినంటూ వసూళ్లు..  గవర్నమెంట్ ఆఫీసర్లే టార్గెట్

    
హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  గవర్నమెంట్ ఆఫీసర్లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఫేక్ ఏసీబీ అధికారిని శంషాబాద్ ఎస్​వోటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలోని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులనే టార్గెట్​చేసుకుని బ్లాక్ మెయిల్​కు పాల్పడినట్లు గుర్తించారు. సైబరాబాద్ ఎస్​వోటీ డీసీపీ రషీద్​తో కలిసి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి ఫేక్ ఏసీబీ అధికారికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏపీ అనంతపురం విడపంకల్‌‌‌‌ మండలం కోటలపల్లికి చెందిన జయకృష్ణ అలియాస్ జయ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్స్ చేశాడు. 2018లో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అక్కడ అనిల్​కుమార్ అనే మరో నిందితుడితో పరిచయం ఏర్పడింది.

 రిలీజ్ అయ్యాక అనిల్ ద్వారా బెంగళూరుకు చెందిన శ్రీనాథ్‌‌‌‌ రెడ్డితో కలిసి ప్రభుత్వ అధికారులను బెదిరించేవాడు. జయకృష్ణపై ఏపీలో 18 కేసులు నమోదయ్యాయి. గూగుల్‌‌‌‌లో అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ అధికారుల ఫోన్‌‌‌‌ నంబర్స్‌‌‌‌ సేకరించాడు. బెంగళూరు నుంచి ఫోన్ చేసి బెదిరించేవాడు. ఏసీబీ హెడ్ ఆఫీస్​లో ఎంక్వైరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నట్లు చెప్పేవాడు. అక్రమాస్తులు కూడబెట్టినట్లు కంప్లైంట్స్ వచ్చాయని బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడు. నాలుగేండ్లలో దాదాపు రూ.1.20 కోట్లు వసూలు చేశాడు. రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు, వృద్ధుల అకౌంట్స్​లో క్యాష్ డిపాజిట్‌‌‌‌ చేయించేవాడు. ఫేక్ ఐడీలతో 200 సిమ్‌‌‌‌ కార్డులు, 100 రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించాడు. టెక్నికల్ గా ఎంతో నాలెడ్జ్ ఉంది.

ఇలా దొరికాడు..

ఈనెల 30న సిద్దిపేట జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ బ్రహ్మణ రావుకు కాల్‌‌‌‌ చేశాడు. ఏసీబీ ఎంక్వైరీ ఆఫీసర్‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి‌‌‌‌గా పరిచయం చేసుకుని ప్లాన్ అమలు చేశాడు. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈనెల 18న సిద్దిపేట జిల్లా హ్యాండ్లూమ్స్‌‌‌‌ టెక్ట్స్‌‌‌‌టైల్స్ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీరామ్‌‌‌‌ సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేసి.. ఏసీబీ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ మహేశ్​గా చెప్పాడు. వీళ్లిద్దరు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు శంషాబాద్‌‌‌‌ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. తర్వాత ఎస్​వోటీ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ సత్యనారాయణ గౌడ్‌‌‌‌ టీమ్‌‌‌‌ జయకృష్ణను శంషాబాద్​లో అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి రూ.85వేల క్యాష్, 8 ఫోన్స్, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుంది.