పాపను బైకుతో ఢీకొట్టాడని.. పొడిచి చంపేశాడు

V6 Velugu Posted on Jun 15, 2021

  • హైదరాబాద్ జగద్గిరిగుట్ట బస్తీలో ఘటన

హైదరాబాద్: చిన్న పాపను బైకుతో ఢీకొట్టాడని కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి ఏకంగా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పాతబస్తీలో జరిగిందీ ఘటన. బైకుతో ఢీకొట్టిన వ్యక్తి తన తప్పిదమేమీ లేదని.. హఠాత్తుగా అడ్డం వచ్చిన పాపను తప్పించేందుకు ప్రయత్నించి తాను సైతం కిందపడి గాయపడ్డానని.. యువకుడు ఎంత బతిమాలుకున్నా పాప తండ్రి శాంతించకపోగా కన్నుమూసి తెరిచేలోగా కత్తితో పొడిచి పొడిచి చంపేయడం సంచలనం సృష్టించింది. 
జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం దావూద్ ఇబ్రహీం బస్తీకి చెందిన జావేద్ అనే యువకుడు రోజువారీ కూలి పనులు చేసుకుని జీవిస్తుంటాడు. నిన్న సోమవారం సాయంత్రం బైకుపై వెళ్తుండగా.. కాలనీ సమీపంలోనే ఓ చిన్న పాప ఆడుకుంటూ బైకుకు అడ్డం వచ్చింది. సడన్ బ్రేక్ వేసి పక్కకు తిప్పడంతో బైకుపై ఉన్న జావేద్ అదుపుతప్పి కిందపడిపోయాడు. బైకు పాపను టచ్ చేస్తూ స్కిడ్ అయింది.  బైకు ఢీకొట్టడం గమనించిన పాప తండ్రి శ్రీహరి అలియాస్  మహమ్మద్ ఉస్మాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాపకే చిన్నపాటి గాయం మినహా ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరో వైపు బైకుపై వెళ్తున్న జావేద్ కూడా చిన్న గాయాలతో బయటపడ్డాడు. 
అయితే తన పాపను ఢీకొట్టాడన్న కోపంతో శ్రీహరి జావేద్ తో వాగ్వాదానికి దిగాడు. తన తప్పేమీ లేదని జావేద్ ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. కోపంతో వాగ్వాదం చేసుకున్నారు. కాలనీ వాసులు సర్దిచెప్పడంతో శాంతించి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఇంట్లో కత్తి తీసుకుని జేబులో పెట్టుకుని.. జావేద్ ఇంటికి వెళ్లి బయటకు పిలిచాడు. మాట్లాడుకుందాం రమ్మంటూ రోడ్డుపైకి పిలుచుకుని వెళ్తూ.. హఠాత్తుగా కత్తి తీసి పొడిచేశాడు. జావేద్ భయంతో కేకలు వేయడం.. స్థానికులు గమనించేలోపే శ్రీహరి బలంగా నాలుగైదు సార్లు పొడిచేయడంతో జావేద్ కుప్పకూలిపోయాడు. స్తానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో కోలుకోలేక కన్నుమూశాడు. జావేద్ ను పొడిచిన శ్రీహరి ముస్లిం మతంలోకి మారి అలియాస్ మహమ్మద్ ఉస్మాన్ పేరు పెట్టుకుని జీవిస్తున్నాడు. జావేద్ ను పొడిచిన అనంతరం పరారైపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tagged Jagadgiri Gutta, brutally murdered, Hyderabad Today, , dawood ibrahim colony, daily wager javed, srihari alias mohammad Osman

Latest Videos

Subscribe Now

More News