
రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూసుఫ్ పూర్ గ్రామ సమీపంలోని పిట్టవాగులో ఓ యువకుడు కొట్టుకుపోయి చనిపోయాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్ పూర్ గ్రామానికి చెందిన మ్యాతరి శ్రీనివాస్(35) మంగళవారం ఉదయం రాయికోడ్ కు వెళ్లాడు. పని ముగించుకొని సాయంత్రం తిరిగి గ్రామానికి వెళ్లేందుకు పొంగి ప్రవహిస్తున్న వాగు బ్రిడ్జిపై నుంచి బైక్ పై వెళ్తుండగా, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2 కిలోమీటర్ల దూరంలోని ధరంపూర్ గ్రామ శివారులోని పొదల్లో శ్రీనివాస్ డెడ్‌బాడీ చిక్కుకోగా, అక్కడి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎస్సై చైతన్య కిరణ్ అక్కడికి చేరుకొని డెడ్‌బాడీని వెలికి తీయించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.