కాగ్నా వాగులో వ్యక్తి గల్లంతు

కాగ్నా వాగులో వ్యక్తి గల్లంతు
  • వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులోని కాగ్నా వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. తాండూరు మండలం సంగంకలాన్ కు చెందిన బొక్తంపల్లి పెంటయ్య(48) శుక్రవారం ఉదయం కర్ణాటకలోని షాపూర్​లో బంధువు అంత్యక్రియలు ఉండటంతో అక్కడికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి సొంతూరికి వచ్చాడు. ఓ కల్లు దుకాణం దగ్గర కొద్దిసేపు కూర్చుకున్న పెంటయ్య తర్వాత ఇంటికి బయలుదేరాడు. 

అదే టైమ్​లో సంగంకలాన్​లోని కాగ్నా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో స్థానికులు వెళ్లొద్దని పెంటయ్యకు చెప్పారు. అతడు వారి మాట వినకుండా వాగు దాటేందుకు యత్నించాడు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో అందులో పెంటయ్య కొట్టుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో కలిసి పెంటయ్య కోసం వాగు వెంబడి గాలింపు చర్యలు 
చేపట్టారు.

చెరువుల్లోకి భారీగా వరద

వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి కాగ్నా, మూసీ, మంచన్ పల్లి తండా, కందనెల్లి, నస్కల్, అన్నా సాగర్, తుంకిమెట్ల, ధర్మాపూర్, మోత్కుపల్లి, కోకట్ ప్రాంతాల్లోని వాగులు పొంగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నస్కల్ వాగు బ్రిడ్జి పై నుంచి వరద పొంగిపొర్లడంతో అధికారులు వాహనదారులను ఇతర దారుల్లో మళ్లించారు. పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.