
కాగజ్ నగర్, వెలుగు: ఓ యువకుడిపై కేసు నమోదు కాగా, ఆ కేసు లేకుండా చేస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల సర్కిల్ ఆఫీస్ లో సీఐ ముత్యం రమేశ్ మంగళవారం చింతలమానేపల్లి, కౌటాల ఎస్సైలు ఇస్లావత్ నరేశ్, విజయ్ తో కలిసి వివరాలు వెల్లడించారు.
చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన యువతి, ఖర్జెల్లికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఇది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. దీంతో యువతి తనను ప్రేమ పేరిట మోసం చేశాడని, పెళ్లి పత్రికలు రాసిన తర్వాత పెళ్లి చేసుకోనని ప్లేటు ఫిరాయించడంతో చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై నరేశ్ విచారణ చేపట్టారు.
ఇదే సమయంలో దహేగాం మండలం రాంపూర్ కు చెందిన ఒండ్రే గణేశ్ పోలీసులతో మాట్లాడి, కేసు కాకుండా చూస్తాడని నమ్మించి యువకుడి తండ్రి నుంచి ఏడు సార్లు ఫోన్ పే ద్వారా రూ.75 వేలు వసూలు చేశాడు. ఈ వ్యవహారంపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, రిమాండ్కు తరలించారు.