భిక్కనూరు, వెలుగు: భూమిని అమ్మే విషయంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఓ వ్యక్తి తన అన్న భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో శుక్రవారం జరిగింది. భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగిర్తిపల్లికి చెందిన మంద పోచయ్యకు ఇద్దరు కుమారులు రాములు, సురేశ్ ఉన్నారు. పోచయ్య ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ట్రీట్‌మెంట్ కోసం పోచయ్య పేరున ఉన్న నాలుగు ఎకరాల భూమి అమ్ముదామని సురేశ్‌సూచించాడు.
ఇందుకు అతడి అన్న రాములు, వదిన లావణ్య అలియాస్ యేసుమణి (49) ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య రెండు రోజుల కింద రూ. 20 వేలు సురేశ్‌కు ఇచ్చి పోచయ్యకు ట్రీట్‌మెంట్ చేయించాలని సూచించింది. భూమి అమ్మే విషయంలో లావణ్య, సురేశ్ మధ్య శుక్రవారం ఉదయం మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సురేశ్ ఇంట్లో ఉన్న కత్తితో వదిన లావణ్యపై దాడి చేశాడు.
గమనించిన అతడి అన్న రాములు, అన్న కొడుకు, కాలనీవాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కత్తి చూపుతూ వారిని బెదిరించి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ లావణ్య అక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న లావణ్య బంధువులు గ్రామానికి చేరుకొని ఆమె అత్తమామలపై దాడికి యత్నించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న సీఐ సంపత్‌కుమార్, ఎస్సై సాయికుమార్ లావణ్య బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వారు వినిపించుకోలేదు.
కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావుకు సమాచారం ఇవ్వడంతో అదనపు బలగాలతో గ్రామానికి చేరుకొని మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఆస్తి మొత్తాన్ని మృతురాలి కుమారుడైన జశ్వంత్ పేరున పట్టా చేయాలని బంధువులు పట్టుబట్టడంతో పెద్దలతో మాట్లాడి పట్టా మార్పిడి చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.