
సిరిసిల్ల: ‘పెద్దమ్మ గుడి దగ్గర చంపేసిన సార్.. తలకాయ తీసేసినా’.. ఓ మహిళను దారుణంగా హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నిందితుడు చెప్పిన మాటలివి. వేట కొడవలితో మహిళను దారుణంగా నరికి చంపి.. ఎలాంటి భయం లేకుండా నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. చందుర్తి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల మెయిన్ రోడ్‌పై సోమవారం (మే 26) సాయంత్రం బొల్లు రాజవ్వ (50) అనే మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వేట కొడవలితో నరికి చంపాడు. హత్యానంతరం దర్జాగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. మహిళను హత్య చేశానని పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.
పెద్దమ్మ గుడి దగ్గర తల నరికి చంపేశానని ఎలాంటి భయం లేకుండా పోలీసులకు చెప్పాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి గతంలో కూడా చందుర్తిలో ఓ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.