పలుగు రాళ్ల గుట్టలపై కన్నేసిన మైనింగ్​ మాఫియా

పలుగు రాళ్ల గుట్టలపై కన్నేసిన మైనింగ్​ మాఫియా
  • గత ప్రభుత్వ హయాంలో ఫోర్జరీ సంతకాలతో తప్పుడు తీర్మానాలు
  •     ప్రశ్నార్థకంగా మారిన గ్రామాల మనుగడ
  •     వ్యాపారులను అడ్డుకుంటున్న ప్రజలు 

అచ్చంపేట, వెలుగు: పచ్చని అడవులతో ఆహ్లాదకరంగా ఉండే నల్లమలను మైనింగ్​ మాఫియా పొతం పెడుతోంది. నల్లమలలోని విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన మాఫియా ఇక్కడి పలుగు రాళ్ల గుట్టలను తవ్వేస్తున్నారు. గత ప్రభుత్వంలో నేతలు, అధికారులను మేనేజ్​ చేసిన మైనింగ్  మాఫియా గ్రామపంచాయతీల్లో తప్పుడు తీర్మానాలు చేయించుకొని లీజు దక్కించుకుంది. గట్టు తుమ్మెన్,​ గోదల్ గుట్టల నుంచి ఇప్పటికే మైనింగ్​ స్టార్ట్​ చేసి తప్పుడు పర్మిట్లతో క్వార్ట్జ్​​రాయిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 

అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల, లింగాల మండలాల పరిధిలో పలుగు రాళ్ల గుట్టలున్నాయి. ఇవి రెవెన్యూ పరిధిలో ఉండడంతో లీజుకు తీసుకొని మైనింగ్  చేస్తున్నారు. వాస్తవానికి లీజుకు తీసుకున్న తర్వాత కూడా తవ్వకాల కోసం గ్రామపంచాయతీ తీర్మానం, రెవెన్యూ, మైనింగ్​ శాఖల నుంచి పర్మిషన్​ తీసుకోవాలి. గుట్టల్లో బ్లాస్టింగ్ చేసేందుకు పోలీసుల పర్మిషన్​ తప్పనిసరి. అయితే నిబంధనలు పాటించకుండా ఆఫీసర్లను మేనేజ్​ చేసి తమ దందా కొనసాగిస్తున్నారు.  

అడ్డుకున్న గ్రామస్తులు..

బల్మూర్​ మండలం మైలారం గ్రామ సమీపంలోని 120/1లో 24.28 హెక్టార్లలో తవ్వకాలు జరిపేందుకు 2017లో అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అప్పట్లోనే తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించిన మైనింగ్  వ్యాపారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో 530 ఇండ్లు ఉండగా, 1,850 జనాభా ఉంది. మైనింగ్​ జరిగే గుట్టకు కేవలం 150 మీటర్ల దూరంలోనే గ్రామం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడేండ్ల కింద లీజును రద్దు చేయాలని 500 మంది గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

తప్పుడు తీర్మానాలతో..

మైలారం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టపై మైనింగ్​ చేసేందుకు గత ప్రభుత్వంలో గ్రామ సభ పెట్టకుండానే కొందరు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తుల సంతకాలను ఫోర్జరీ చేసి తప్పుడు తీర్మానం పొందారు. ఈ విషయం ఆర్టీఐ ద్వారా గుర్తించి, ఈ విషయాన్ని అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పొందిన అనుమతులను రద్దు చేయాలని ఫిర్యాదు చేశామనిగ్రామస్తులు తెలిపారు.

మళ్లీ కలకలం..

మూడున్నరేండ్ల తరువాత మైనింగ్​ వ్యాపారులు ఈనెల 5న మైలారం గుట్టను తవ్వేందుకు రాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. వ్యాపారులతో కలిసి వచ్చిన పోలీసులతో మూడు గంటల పాటు గ్రామస్తులు-వాగ్వాదానికి దిగారు. తమ ప్రాణాలు పోయినా గుట్టను తాకనివ్వమని గ్రామస్తులు భీష్మించడంతో అచ్చంపేట సీఐ రవీందర్, ఎస్ఐ బాల్ రాజు వ్యాపారులతో మాట్లాడి తాత్కాలికంగా పనులు నిలిపేశారు.

అభ్యంతరాలు పరిశీలిస్తాం 

మైలారం గుట్టలో మైనింగ్​ చేసేందుకు గతంలోనే అనుమతులు ఇచ్చాం. మైనింగ్  చేపట్టేందుకు వెళ్లిన వ్యాపారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తుల అభ్యంతరాలను పరిశీలిస్తాం.
- రవీందర్, మైనింగ్​ ఏడీ, నాగర్ కర్నూల్