మెదక్‌‌ జిల్లా: కొడుకును చంపించిన తల్లి.. ప్రియుడితో కలిసి దారుణం

మెదక్‌‌ జిల్లా: కొడుకును చంపించిన తల్లి.. ప్రియుడితో కలిసి దారుణం
  • వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని 
  •  తూప్రాన్‌‌లో  పది నెలల కింద హత్య

తూప్రాన్‌‌, వెలుగు : మెదక్‌‌ జిల్లా తూప్రాన్‌‌ మండలంలో గతేడాది నవంబర్‌‌లో జరిగిన ఓ మర్డర్‌‌ మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తల్లే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను తూప్రాన్‌‌ డీఎస్పీ నరేందర్‌‌గౌడ్‌‌ శుక్రవారం తెలిపారు. 

తూప్రాన్‌‌ మండలం వెంకటాయపల్లికి చెందిన అహ్మద్‌‌ పాషా (25) తండ్రి చనిపోవడంతో తల్లి రహేనాతో కలిసి ఉంటున్నాడు. రహేన మనోహరాబాద్‌‌ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కందల భిక్షపతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అహ్మద్‌‌ పాషాకు తెలియడంతో తల్లీకొడుకుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్‌‌ 28న తన ప్రియుడు భిక్షపతితో కలిసి అహ్మద్‌‌పాషాను ఆబోతుపల్లి శివారులోని చెక్‌‌డ్యాం వద్దకు తీసుకెళ్లింది. అక్కడ మద్యం తాగించిన అనంతరం తాడు, చున్నీని గొంతుకు బిగించి చంపేసిన తర్వాత డెడ్‌‌బాడీని చెక్‌‌డ్యామ్‌‌లో పడేశారు. 

తెల్లవారి చెక్‌‌డ్యామ్‌‌లో డెడ్‌‌బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా... మృతుడి తల్లే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. శుక్రవారం పోతురాజుపల్లి వద్ద ఉన్న రహేనా, భిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న సీఐ రంగా కృష్ణ, ఎస్సై శివానందం, పోలీస్‌‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.