
రామ్, ఇలియాన, సాయిధరమ్ తేజ్, సయామీ ఖేర్ లాంటి పలువురు హీరోహీరోయిన్స్‌ను పరిచయం చేసిన దర్శకుడు వైవీఎస్ చౌదరి.. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ కొత్త హీరోను పరిచయం చేస్తున్నారు. హరికృష్ణ మనుమడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై ఆయన భార్య యలమంచిలి గీత నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ అభిమానినైన నేను ఆయన నాలుగో తరం వారసుడిని పరిచయం చేస్తుండడం సంతోషంగా ఉంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేయడం మా అదృష్టం. ఓ తెలుగమ్మాయిని ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. నా ప్రతి సినిమా తరహాలోనే ఇందులోనూ సంగీతం, సాహిత్యానికి ప్రాముఖ్యత ఉంటుంది’ అని అన్నారు.