డిగ్రీ లెక్చరర్ పోస్టులకు లక్ష మందికిపైగా దూరం

డిగ్రీ లెక్చరర్ పోస్టులకు లక్ష మందికిపైగా దూరం
  • డీఎల్ పోస్టులకూ ఇదే రూల్ పెట్టే చాన్స్ 
  • ఆందోళనలో లక్ష మంది అభ్యర్థులు 
  • నోటిఫికేషన్ నాటికే సెట్ క్వాలిఫై కావాలంటూ రూల్ 

హైదరాబాద్, వెలుగు:  డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల అభ్యర్థులకు కొత్త సమస్య వచ్చి పడింది. దరఖాస్తు నాటికే టీఎస్ సెట్ క్వాలిఫై అయి ఉండాలనే నిబంధనతో సుమారు లక్ష మంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం గత మూడేండ్లుగా  టీఎస్ సెట్ పెట్టలేదు. గత నెలలో సెట్ నోటిఫికేషన్​వేసినా, ఇప్పుడు దానితో ఉపయోగం లేకుండా పోయింది. సర్కారు నిబంధనలు సవరించి, తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. రాష్ట్రంలో చాలా ఏండ్ల తర్వాత పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 7న టీఎస్‌‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 491 డిగ్రీ లెక్చరర్ల భర్తీకి డిసెంబర్ 31న నోటిఫికేషన్ వచ్చింది. త్వరలోనే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానున్నది. దీంతో నెట్,సెట్ క్వాలిఫికేషన్ కీలకంగా మారింది. యూజీసీ నిబంధనల ప్రకారం సెట్​లో క్వాలిఫై అయిన వారే డిగ్రీ, పాలిటెక్నిక్, యూనివర్సిటీల్లోని లెక్చరర్ పోస్టులకు అర్హులు. ఇప్పటికే పాలిటెక్నిక్ లెక్చరర్ల నోటిఫికేషన్​లో పలు పోస్టులకు నెట్ లేదా సెట్ ఉండాలని నిబంధన పెట్టారు. నోటిఫికేషన్ తేదీ నాటికే క్వాలిఫై అయితేనే ఎలిజిబులిటీ ఉంటుందన్నారు. దీంతో సెట్, నెట్ క్వాలిఫై కాని వారు, కొత్తగా రాసేందుకు ఎదురుచూస్తున్న వారంతా ఆందోళనలో ఉన్నారు.    

మూడేండ్లు నోటిఫికేషన్ రాలే.. 

తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీఎస్​సెట్)ను ఏటా నిర్వహించాల్సి ఉన్నా.. 2014 (రెండు రాష్ర్టాలకు)తో పాటు 2017, 2018, 2019 సంవత్సరాల్లో మాత్రమే నిర్వహించారు. ఆ తర్వాత 2020, 2021లో టీఎస్ సెట్ పెట్టలేదు. 2019 మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వగా, మళ్లీ మూడున్నర ఏండ్ల తర్వాత 2022 డిసెంబర్ నెలాఖరులో టీఎస్ సెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మూడేండ్ల కాలంలో వేలాది మంది పీజీ స్టూడెంట్లు బయటకు వచ్చారు. వారంతా సెట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు గతంతో సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై కానోళ్లూ చాలామంది ఉన్నారు. వారంతా కలిపి సెట్ కోసం ఎదురుచూసే వాళ్లు సుమారు లక్ష మంది ఉంటారని అంచనా. తాజాగా ఓయూ టీఎస్​సెట్ నోటిఫికేషన్ వేసినా, డీఎల్, పాలిటెక్నిక్ పోస్టులకు ఉపయోగం లేకపోయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్ల నుంచి సెట్ నిర్వహించలేదు కాబట్టి.. డీఎల్, పాలిటెక్నిక్ పోస్టుల ఫలితాలు వచ్చేలోపు సెట్ క్వాలిఫై అయినా అర్హులుగా ప్రకటించాలని కోరుతున్నారు.  

న్యాయం చేయాలె 

రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత టీఎస్​సెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంతో, చాలామంది సెట్ క్వాలిఫికేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. 2019 తర్వాత పీజీ పూర్తయిన వారికి సెట్ రాసే అవకాశమే రాలేదు. అందుకే సెట్ 2022 రిజల్ట్​తర్వాతే డిగ్రీ లెక్చరర్ల భర్తీ ప్రక్రియ చేపట్టి అభ్యర్థులకు న్యాయం చెయ్యాలి. 
- ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు