
ప్రస్తుత జీవన శైలి, విధానాల వల్ల వచ్చే అనేక కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వయసు సంబంధిత వ్యాధులతో పాటు కాలానుగుణంగా వచ్చే వ్యాధులు కూడా మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. నేటి కాలంలో చాలా మంది గంటల తరబడి ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల స్ర్కీన్ వల్ల అనేక కంటి సమస్యలు వస్తున్నాయి. ఇవి కాలక్రమంలో నో లైట్ పర్సెప్షన్ అంటే అంధత్వానికి దారి తీసే ప్రమాదం ఉందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఎన్‌ఎల్‌పీ సమస్యపై నిర్వహించిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజన్ లాస్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ అంచనా ప్రకారం.. ప్రపంచంలో 40 మిలియన్ల మంది అంధులు ఉన్నారట. కనీసం ఒక మీటర్ దూరంలో ఉన్న చేతి వేళ్లను సైతం లెక్కించలేని స్థితిలో ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. రోజురోజుకూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ సయన్ బసు, ఆప్తమాలజిస్ట్ డాక్టర్ ఆంథోStనీ విపిన్‌దాస్ 2010 నుంచి 2022 మధ్య 32,78,132 మంది రోగుల రికార్డులను పరిశీలించారు. అందులో 60,668 (1.85 శాతం) మందికి ఎన్‌ఎల్‌పీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. స్త్రీల కంటే పురుషుల్లోనే (64 శాతం) ఈ సమస్య అధికంగా ఉన్నట్టు వారు గుర్తించారు. పట్టణ, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించేవారితో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల వారిలోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేలింది. గ్లకోమా, గాయం వంటి ప్రాథమిక కారణాలు ఈ సమస్యకు దారితీస్తున్నట్టు వెల్లడైంది. నరాల పునరుత్పత్తి ప్రక్రియ, ఐబాల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలు ఎన్‌ఎల్‌పీ ప్రాబల్యాన్ని నివారించేందుకు ఔషధాలుగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు.