కడుపులో కవలలతో గర్భిణి మృతి : బంధువుల శవయాత్ర

కడుపులో కవలలతో గర్భిణి మృతి : బంధువుల శవయాత్ర

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. బరిపడలో ఓ గర్భిణి చనిపోవడంతో.. ఆమె బంధువులు తీవ్రమైన నిరసన తెలిపారు. ఇంకొద్దిరోజుల్లోనే ఆ గర్భిణి .. కవలలకు జన్మనివ్వాల్సి ఉంది. త్వరలోనే కవల బిడ్డలు తమ కుటుంబంలోకి రాబోతున్నారని వాళ్లు ఎన్నో కలలు కన్నారు. త్వరలోనే ఆ రోజు రాబోతోందని ఆనందపడ్డారు.

ఐతే… స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆమెకు రెగ్యులర్ చెకప్ వికటించింది. కడుపులో కవల బిడ్డలతో పాటు.. తల్లి చనిపోయింది. బంధువులు తీవ్రంగా కలత చెందారు. హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యమే ఆమెను చంపేసిందని ఆవేదన చెందారు. తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా .. శవాన్ని ఊరేగించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మూడు ప్రాణాలు పోవడంతో… స్థానికులు కూడా కంటతడి పెట్టారు.

దీనిపై ఒడిశాలో ఆరోగ్య అధికారులు స్పందించారు. పేషెంట్లు ఉన్నారు… కాస్త ఎదురుచూడండని చెప్పినా వినకుండా బయటకు వెళ్లి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నారని.. అక్కడే ఈ విషాదం జరిగిందని అన్నారు. హాస్పిటల్ లో తప్పు జరగలేదన్నారు.

ఆ టైమ్ లో డాక్టర్లు విధులకు దూరంగా ఉన్నారని మరో వాదన వినిపిస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినదాంట్లో నిజం లేదన్నారు బంధువులు. డాక్టర్లు అందుబాటులో ఉండి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని అన్నారు. డబ్బులున్నవారికి ఇలాంటి కష్టాలు రావని.. పేదవారే ఇబ్బందులు పడతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.