హైదరాబాద్ బుక్ ఫెయిర్​లో సౌలతుల్లేవ్ 

హైదరాబాద్ బుక్ ఫెయిర్​లో సౌలతుల్లేవ్ 

విజిటర్లు రోజూ 20 వేలు.. 
మగోళ్లకు, ఆడోళ్లకు ఐదు చొప్పున టాయిలెట్లు 
టాయిలెట్ ఇబ్బందిపై సందర్శకుల ఆగ్రహం 
సోషల్ మీడియాలో పోస్ట్‌‌‌‌లు పెడ్తూ నిరసనలు  

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది. అయితే బుక్ ఫెయిర్ కు వస్తున్న విజిటర్లను మాత్రం ఒక సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. అత్యవసర సమయంలో వెళ్లేందుకు సరిపడా టాయిలెట్లు అందుబాటులో లేక, ఉన్న నాలుగైదు టాయిలెట్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విజిటర్లు బుక్ ఫెయిర్ మేనేజ్‌మెంట్‌పై ఫైర్​ అవుతున్నారు. అనేకమంది బుక్ ఫెయిర్​లో ఉన్న సమస్యల ఫొటోలను పోస్ట్ చేస్తూ పరిస్థితిపై మండిపడుతున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.  

రోజూ వేల మంది వస్తున్రు  

ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటైన బుక్ ఫెయిర్ లో 340 స్టాళ్లు ఏర్పాటు చేయగా, దాదాపు 10 లక్షల పుస్తకాలను అందుబాటులో పెట్టారు. బుక్ ఫెయిర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు రోజుల్లో దాదాపు 3  లక్షల మంది విజిట్ చేశారు. నగరం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ వస్తున్నారు. అన్ని హంగులు, ఆర్భాటాలతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనలో కనీస సౌకర్యాలు లేవని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నారు. బుక్ ఫెయిర్ కు వెళ్లారంటే గంటల తరబడి అన్ని స్టాళ్లు తిరుగుతూ చాలామంది అక్కడే ఉండిపోతారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే సరిపడినన్ని టాయిలెట్లు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రోజూ 20 వేల మంది విజిటర్లు వస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. కానీ మగవాళ్ల కోసం ఐదు, ఆడవాళ్ల కోసం మరో ఐదు టాయిలెట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. వేల మందికి ఇవి ఎలా సరిపోతాయని విజిటర్లు ప్రశ్నిస్తున్నారు.

లక్షల్లో ఆదాయం వస్తున్నా..

బుక్ ఫెయిర్ లో ఒక్కో స్టాల్ యజమాని నుంచి రూ. 15 వేలు వసూలు చేశారు. దీనికి తోడు ఎంట్రీ ఫీజు రూ.10 తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది విజిట్ చేయగా వారి నుంచి రూ. 30 లక్షల వరకు కలెక్ట్ అయింది. స్టాళ్ల రెంట్లు, సందర్శకుల ఎంట్రీ ఫీజులు కలిసి దాదాపు రూ. 85 లక్షల పైనే బుక్ ఫెయిర్ ట్రస్ట్ కు ఆదాయం వచ్చింది. ఇలా లక్షల్లో ఆదాయం వస్తున్నా కనీస సౌలతులను కల్పించడంపై నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం ఉన్న టాయిలెట్ల మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఒకటి, రెండు రోజుల నుంచే నిర్వాహకులు మెయింటెనెన్స్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సిబ్బంది చెప్తున్నారు.