తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం.. కాంగ్రెస్ కౌన్సిలర్, ఆమె భర్తపై నాన్ బెయిలబుల్ కేసులు

తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం.. కాంగ్రెస్ కౌన్సిలర్, ఆమె భర్తపై నాన్ బెయిలబుల్ కేసులు

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. తుర్కయాంజల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ, ఆమె భర్త కొత్త కుర్మ శివకుమార్ పై ఆదిభట్ల పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. 

అసలేం జరిగింది..? 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా గురువారం (ఆగస్టు 17వ తేదీన) మంత్రి హరీష్ రావు పర్యటించారు. మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. శిలాఫలకంపై తన పేరు లేదని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మంగమ్మ, ఆమె భర్త శివకుమార్ నిరసన చేపట్టారు. వీరికి తోడుగా తుర్కయాంజాల్ మున్సిపల్ చైర్మన్ అనురాధ, వైస్ చైర్మన్ హరిత, కౌన్సిల్ సభ్యులు రేవల్లి హరిత యాదగిరి, ఉదయశ్రీ, మేతరి అనురాధ దర్శన్, కంబలపల్లి ధన్ రాజ్, బాల్ రాజ్, శివలింగం గౌడ్, ఐలయ్య నిరసన తెలిపారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. 

అధికార యంత్రాంగం తీరును నిరసిస్తూ.. శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు కౌన్సిలర్ మంగమ్మ, ఆమె భర్త శివకుమార్. దీంతో పోలీసులు కౌన్సిలర్ దంపతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, స్థానిక ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. న్యాయస్థానం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. 

మంత్రి హరీష్ రావు పర్యటనలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని అడిగినందుకు.. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మంగమ్మ, ఆమె భర్త శివకుమార్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు అని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కనీసం ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు.