నాగోబా దర్బార్ అంటే ఏంటి.. ప్రత్యేకతలేంటి..?

నాగోబా దర్బార్ అంటే ఏంటి.. ప్రత్యేకతలేంటి..?

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతర అత్యంత వైభంగా సాగుతోంది. నాగోబా జాతర అనగానే చాలామందికి దర్బార్ గుర్తుకువస్తుంది. అసలు ఈ దర్బార్ ఏంటి..? ఎందుకు నిర్వహిస్తున్నారు..? దీని ప్రత్యేకత ఏంటి..? ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు..? దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

నాగోబా జాతరలో దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 73 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఏజెన్సీల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవికావు. వారి సమస్యలు ఎవరికీ పట్టేవి కావు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం  రాజు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, వారి స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు.

హైమన్‌డార్ఫ్ దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని నిజాం ప్రభుత్వానికి చెబుతారు. దీంతో హెమన్ డార్ప్ సలహా, సూచనతో అప్పటి నిజాం ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక దర్బార్‌ను ప్రారంభించింది. అలా1946లో మొట్టమొదటిసారి నిర్వహించారు. నేరుగా గిరిజనుల వద్దకే అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించాలని అప్పటి నిజాం ప్రభుత్వం సూచించింది. దీంతో అప్పటి నుంచి 72 ఏళ్లుగా ప్రతిఏటా నాగోబా దర్బార్ కొనసాగుతోంది. ఈ దర్బార్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు వెళ్తుంటారు. 

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నాగోబా దర్బార్ కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సాంప్రదాయం. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. 

కెస్లాపూర్ నాగోబా జాతరను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. మేడారం సమ్మక్క-సారక్క జాతర తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవంగా నాగోబా జాతరను నిర్వహిస్తున్నారు. నాగోబా జాతర సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రతిఏటా ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆదివాసీ గిరిజనులకు మంజూరు చేసిన సంక్షేమ పథకాలను అక్కడే పంపిణీ చేయనున్నారు.