19 లక్షల కేసులు.. రూ.50 కోట్ల ఫైన్లు!

19 లక్షల కేసులు.. రూ.50 కోట్ల ఫైన్లు!

19 లక్షల కేసులు.. రూ.50 కోట్ల ఫైన్లు!
వరంగల్ కమిషనరేట్ లో రికార్డు స్థాయిలో చలాన్లు

హనుమకొండ, వెలుగు : వరంగల్ పోలీస్​ కమిషనరేట్​పరిధిలో ట్రాఫిక్​ వయోలేషన్​ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హెల్మెట్​ పెట్టుకోలేదని, వెహికల్స్​కు ఇన్సూరెన్స్, లైసెన్స్, అనాథరైజ్డ్​పార్కింగ్.. ఇలా వివిధ కారణాలతో పోలీసులు చలాన్లు విధించగా.. గడిచిన 12 నెలల్లోనే 19 లక్షలకు పైగా కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో కమిషనరేట్​పరిధిలో బండి బయటకు తీయాలంటేనే జనాలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ట్రాఫిక్​ చలాన్ల మీదనే  ప్రభుత్వ ఖజానా​ కు రూ.50.33 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. కాగా పార్కింగ్, రోడ్లు, పట్టించుకోని పోలీసులు  ఇంత భారీగా ఫైన్లు వేయడంపై జనాలు మండిపడుతున్నారు. 

అన్ని వింగ్ లు ట్రాఫిక్​ డ్యూటీలోనే..

వరంగల్ కమిషనరేట్​ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉండగా.. మొత్తంగా 44 లా అండ్​ఆర్డర్​,3 ట్రాఫిక్​  స్టేషన్లున్నాయి.  కాగా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ ఏడాది ట్రాఫిక్​ చలాన్లపైనే  ఫోకస్​ పెట్టింది. ఈ మేరకు పోలీస్​ ఆఫీసర్లు ట్రాఫిక్​ను కంట్రోల్​ చేయాల్సిన డ్యూటీని వదిలేసి  ఫొటోలు తీయడం, ఫైన్లు విధించడంపైనే  ఫోకస్​పెట్టారు. ట్రాఫిక్​ సిబ్బందితో పాటు లా అండ్​ఆర్డర్, స్పెషల్​పార్టీ, ఏఆర్​ విభాగాల పోలీసులకూ  కెమెరాలు  ఇచ్చి రోడ్లపైకి పంపించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు, రోజువారీ టార్గెట్లు, ఫొటోకు ఇంత కమిషన్​అంటూ సిబ్బందికి ఆఫర్​ చేయడంతో వాళ్లంతా పోటీ పడి మరీ ఫొటోలు తీశారు. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్​ జామ్ అయినా పట్టించుకోకుండా ఫొటోలు తీయడానికే  మొగ్గు చూపారు. దీంతోనే గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా ట్రాఫిక్​ వయొలేషన్​ కేసులు నమోదయ్యాయి.  ట్రాఫిక్​ రూల్స్​ఉల్లంఘన పేరుతో వరంగల్ పోలీసులు ఇష్టారీతిన కెమెరాకు పని చెప్పారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా వితౌట్​హెల్మెట్​పై స్పెషల్​ డ్రైవ్స్​ చేపట్టారు. అడుగు తీసి అడుగేసే క్రమంలోనే ఫొటోలు తీసి చలాన్​ మెసేజ్​లు పంపించారు. దీంతోనే ఈ ఏడాది వితౌట్​హెల్మెట్​భారీగా ఫైన్లు నమోదు అయ్యాయి. 

నిరుడి కంటే రూ.20 కోట్లు ఎక్కువ

కమిషనరేట్​ లో గతేడాది 13 లక్షల ట్రాఫిక్​ వయోలేషన్​ కేసులు నమోదయ్యాయి. ఈ యేడు స్పెషల్​ టార్గెట్లు పెట్టుకుని రూ. 6 లక్షల చలాన్లు అదనంగా విధించారు. దీంతో  115 వయోలేషన్లలో చలాన్ల సంఖ్య 19 లక్షలకు చేరింది. ఇక ఫైన్ల రూపంలో గతేడాది వాహనాదారులపై రూ.31 కోట్ల భారం పడగా.. ఈసారి పోలీసులు మరో రూ.20 కోట్లు పెంచి రూ.50 కోట్లు భారాన్ని మోపారు. ఇందులో  ఎక్కువగా వితౌట్​హెల్మెట్​కు విధించిన ఫైన్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 19.33 లక్షల ఫైన్లలో హెల్మెట్​ లేని కారణంతోనే 12.13 లక్షల చలాన్లు విధించి.. అత్యధికంగా రూ.21.20 కోట్ల ఫైన్లు వేశారు. దాంతో పాటు ఈసారి ఓవర్​ స్పీడ్​ పైనా పోలీసులు గట్టి ఫోకసే పెట్టారు.  హైవేలపై స్పీడ్​ గన్స్​ఏర్పాటు చేసి.. లిమిట్​ దాటిన వెహికల్స్​కు రూ.1,000 తగ్గకుండా ఫైన్​ వేశారు. ఇలా ఓవర్​ స్పీడ్​ వెహికల్స్​ కు రూ.15.67 కోట్లు, డ్రైవింగ్​ లైసెన్స్​ లేని కారణంతో రూ.3.3 కోట్లు, ట్రిపుల్​ రైడింగ్​ కేసుల్లో రూ.2.63 కోట్ల ఫైన్లు వేశారు. 

సామాన్యులపైనే భారం

ట్రాఫిక్​ రూల్స్​ వయొలేషన్​ కేసులు వరంగల్ సెంట్రల్​ జోన్​ పరిధిలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. హనుమకొండ సిటీ మొత్తం సెంట్రల్​ జోన్​ పరిధిలోనే ఉండగా.. ఇక్కడే పోలీసులు ఎక్కువ ఫైన్లు విధించారు. వాస్తవానికి సిటీలో 4.5 లక్షల వెహికల్స్​ వరకు ఉండగా.. హాస్పిటల్స్​, ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​, ఇండస్ట్రీస్​, షాపింగ్​మాల్స్​, గవర్నమెంట్​ ఆఫీసుల్లో పని కోసం నిత్యం మరో రెండు లక్షల వెహికల్స్​వరకు సిటీ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో ఎక్కువ శాతం మధ్య తరగతి, ఆ కిందిస్థాయి ప్రజలే ఎక్కువగా ఉంటారు. అయితే చిన్న చిన్న కారణాలతో పోలీసులు ఫైన్లు విధిస్తుండటంతో ఆ ప్రభావం ప్రైవేటు ఉద్యోగులు, చిరువ్యాపారులపైనా ఎక్కువగా పడుతోంది.  

జనాలను ఇబ్బంది పెడుతున్నరు

పోలీస్​ సిబ్బంది టార్గెట్లు పెట్టుకుని  ఇష్టమొచ్చినట్లు ఫైన్లు  వేస్తున్నారు. దీంతో చిన్న చిన్న ఉద్యోగాలు, చిరువ్యాపారాలు చేసేవాళ్లపై భారం పడుతోంది. ఫెసిలిటీస్​ కల్పించి రూల్స్​ బ్రేక్​ చేసిన వారిపైనే యాక్షన్​ తీసుకోవాలి. 
- లింగా రెడ్డి, వాహనాదారుడు, హనుమకొండ

కార్లు పెట్టే జాగేలేదు

ఫ్యామిలీతో సిటీకి వచ్చి షాపింగ్​ కో.. ఏదైనా కొనడానికో వెళ్లాలంటే కనీసం కార్​ పార్క్​ చేసే జాగే లేదు. ఎక్కడైనా ఖాళీ స్థలం చూసి పార్క్​ చేసి వెళ్తే  తిరిగి వచ్చే సరికి చలాన్ విధించినట్లు మెసేజ్​ వస్తోంది. ముందుగా పార్కింగ్​ ప్లేసులు చూపించి, ఆ తరువాత చలాన్లపై ఫోకస్​ పెట్టాలి. 
- శ్యాం యాదవ్, వరంగల్