దడ పుట్టిస్తున్న దొంగలు

దడ పుట్టిస్తున్న దొంగలు

మారణాయుధాలతో సంచరిస్తున్న ముఠా
గ్రామాల్లో గస్తీ తిరుగుతున్న యువకులు 

ఆదిలాబాద్, వెలుగు : వరుస దొంగతనాలు ఉమ్మడి జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వివరాల ప్రకారం చెడ్డి గ్యాంగ్ తిరుగుతున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్​జిల్లా జైనథ్​ మండలం దీపాయిగూడలో ఈనెల 24న రెండిళ్లు, 26న బోథ్​మండలం పొచ్చెర, 27న పట్టణంలోని న్యూహౌజింగ్ బోర్డు, ఇచ్చోడలో రెండు రోజులుగా దొంగలు హల్ చల్​చేశారు. దొంగలు రాత్రి.. పగలు తేడా లేకుండా ఇళ్లలోకి చొరబడుతున్నారు. కిటికీలను, తలుపులను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. 

మధ్యప్రదేశ్​ముఠాగా అనుమానాలు...

జిల్లాలో జరుగుతున్న దొంగతనాల్లో నలుగురు ముఠా సభ్యులు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నారు. వీరంత గతంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మధ్యాప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మారణాయుధాలతో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఆరు రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా ఏడు చోట్ల దొంగతనాలు జరిగాయి. దీంతో యువకులు గస్తీ తిరుగుతున్నారు. కర్రలు, రాడ్లు పట్టుకొని ఊరి చివర 
కూర్చుంటున్నారు. పలు గ్రామాల్లో దొంగలు వస్తున్నారంటూ డబ్బు చాటింపు వేయిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానిత వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. 

లక్షెట్టిపేటలో మిట్టమధ్యాహ్నం చోరీ..

లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని శివాజీనగర్ లో ఆదివారం మధ్యాహ్నం దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి వెనుకవైపు పగలగొట్టి లోపలికెళ్లిన దొంగలు బీరువాలోని మూడు తులాల బంగారం, సుమారు రూ. 45 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని శాంతికుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.

ఇచ్చోడలో పట్టపగలే దొంగల సంచారం...

ఇచ్చోడ,వెలుగు: ఆదిలాబాద్​జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇచ్చోడ విద్యానగర్​లో శనివారం దొంగలు మూడిళ్లలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. మాదాపూర్ గ్రామంలో ఆదివారం ముఖానికి దస్తీ కట్టుకొని పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడ్డారు. మహిళలు కేకలు వేయడంతో పారి పోయా రు. చుట్టుపక్కల యువకులు వెంబడించినా ఫలితం లేకుండా పో యింది. సీఐ ముదావత్ నైలు, ఎస్సై నీరేశ్ విచారణ ప్రారంభించారు.

నిఘా పటిష్టం చేశాం..

దొంగలపై నిఘా పెంచాం. జిల్లాలో తిరుగుతున్న ముఠా మధ్యప్రదేశ్​దొంగలుగా గుర్తించాం. ప్రజలు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. రాత్రి పెట్రోలింగ్, వాహనాల తనిఖీ ముమ్మరం చేశాం.

- ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్పీ ఆదిలాబాద్