ఢిల్లీ అల్లర్లు: 70 మంది ముస్లింలను రక్షించిన తండ్రీకొడుకులు

ఢిల్లీ అల్లర్లు: 70 మంది ముస్లింలను రక్షించిన తండ్రీకొడుకులు

ఢిల్లీలో జరిగిన అల్లర్ల వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు 50 మంది చనిపోయారు. ఢిల్లీ అల్లర్లలో ఒక వర్గం వాళ్లు మరో వర్గం మీద దాడి చేస్తున్నారు.

ఫిబ్రవరి 24న జరిగిన అల్లర్ల నుంచి సిక్కు మతానికి చెందిన ఓ తండ్రీకొడుకులు దాదాపు 70 మంది ముస్లింలను రక్షించారు. మొహిందర్ సింగ్ అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి గోకుల్‌పురి ప్రాంతంలో జరిగిన హింసాకాండ నుంచి ముస్లింలను తమ ద్విచక్రవాహానాలపై తరలించారు. మానవత్వంతోనే వారిని రక్షించినట్లు ఆయన తెలిపారు.

‘‘హింసాకాండ జరిగిన సమయంలో నేను మరియు నా కొడుకు కలిసి దాదాపు 60 నుండి 70 మంది ముస్లింలను ఇక్కడి నుంచి తరలించాం. నేను నా స్కూటర్‌ మీద తీసుకెళ్తే.. నా కొడుకు అతని బుల్లెట్‌ మీద తీసుకెళ్లాడు. వారిని తరలించడానికి మేము గోకుల్‌పురి నుండి కర్దాంపూరికి 20 రౌండ్లు తిరిగాం. ఆ రోజు వారు భయపడటం చూసి వారిని ఎలాగైనా ఇక్కడి నుండి తరలించాలని నిర్ణయించుకున్నాం. మేం వారిని వేరే మతానికి చెందిన వాళ్లలాగా చూడలేదు.. కేవలం మనుషులుగా చూశాం. అందుకే మానవత్వంతో వారిని రక్షించాం. నేను 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ప్రత్యక్ష సాక్షిని. ఇప్పటి హింసాకాండను చూస్తే.. నాకు ఆనాటి హింస గుర్తుకు వచ్చింది. నిరసనకారులు ముస్లింలను గుర్తించకుండా ఉండేందుకు వారికి మా తలపాగాలను ఇచ్చాం. మేం కాపాడిన వారిలో మహిళలు మరియు పిల్లలు కూడా ఉన్నారు. మొదట వారిని తీసుకెళ్లి.. ఆ తర్వాత పురుషులను తీసుకువెళ్ళాం’’ అని మొహిందర్ సింగ్ తెలిపారు.

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల వల్ల దాదాపు 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింసాకాండపై దర్యాప్తు చేయడం కోసం ప్రభుత్వం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

For More News..

హైదరాబాద్‌లో సిలిండర్ల వరుస పేలుళ్లు

జవానుకు పెండ్లి కానుకగా కొత్త ఇల్లు

ఉద్యోగులకు త్వరలో మరో షాక్?