యాక్సిడెంట్​లో బ్రెయిన్ డెడ్ ..ఇద్దరికి పునర్జన్మ.. 

యాక్సిడెంట్​లో బ్రెయిన్ డెడ్ ..ఇద్దరికి పునర్జన్మ.. 

న్యూఢిల్లీ: ఆరేండ్ల పిల్లాడు యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ పరిస్థితిలోనూ దు:ఖాన్ని దిగమింగి, కొడుకు అవయవాలను దానం చేశారు. తమ కొడుకు వల్ల మరికొందరి ప్రాణం నిలబడుతుందంటే, అంతకంటే ఏం కావాలని చెప్పారు. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేండ్ల పిల్లాడి తలకు తీవ్ర గాయమైంది. తల్లిదండ్రులు ఢిల్లీలోని ఎయిమ్స్​కు తీసుకొచ్చారు. అక్కడి ట్రామా సెంటర్​లో ట్రీట్ మెంట్ అందించిన డాక్టర్లు.. బ్రెయిన్ డెడ్​గా ప్రకటించారు. తల్లిదండ్రులకు విషయం చెప్పి, అవయవ దానంపై అవగాహన కల్పించారు. పిల్లాడి అవయవాలతో  మరికొందరి ప్రాణం నిలబడుతుందని చెప్పారు. దీంతో అవయవ  దానానికి పిల్లాడి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. 

ఇద్దరికి పునర్జన్మ.. 

ఈ పిల్లాడి అవయవాలను ఇద్దరికి అమర్చినట్లు ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు. ‘‘పిల్లాడు ఒక్కటే కిడ్నీతో పుట్టాడని టెస్టుల్లో గుర్తించాం. దానిని మరో బాలుడికి అమర్చినం. ఇక లివర్​ను 16 ఏండ్ల బాలుడికి ట్రాన్స్ ప్లాంట్ చేసినం” అని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు.