అడవి పంది..ఓ నీతికథ..

అడవి పంది..ఓ నీతికథ..

మండెపల్లి అడవిలో అధిక వర్షపాతం ఉండేది. అడవిలో ఏ క్షణం వర్షం పడుతుందో అర్థమయ్యేది కాదు. కొద్దిసేపట్లోనే అడవంతా నీళ్ళు చేరి, బురదగా మారిపోయేది. అందువల్ల అడవిలో చెట్ల పైనే పక్షులు, జంతువులు నివాసం ఏర్పాటు చేసుకునేవి. అడవిలో అధిక వర్షపాతం ఉన్నందున పచ్చని గడ్డి నీటికి ఎరుపెక్కి తినబోతే చేదుగా మారేది.  

అడవిలో జంతువులకు పచ్చని గడ్డి లేక చెట్ల కొమ్మల చిగురు ఆకులతో ఆకలి తీర్చుకునేవి. అతి వర్షపాతం మూలంగా ఆకలికి మాడుతున్న జంతువులు చాలాసార్లు అరిచేవి. అడవి పక్కనే ఉన్న రైతులకు జంతువులు ఎందుకు అరుస్తున్నాయో అర్థం అయ్యేది కాదు. కొన్నిసార్లు జంతువులు అడవి నుంచి బయటకు వచ్చి పంటపొలాలను తిని వెళ్ళేవి. రైతులు జంతువుల్ని వెళ్లగొట్టేవాళ్లు.

 ఒకసారి అడవి పంది ఆకలికి తట్టుకోలేక అరుస్తూ అడవి నుంచి బయటకు వచ్చింది. పచ్చని పైరు ఉన్న ఒక మడిలోకి దుమికి పైరును ఏ మాత్రం తినకుండా, మడిలోని పైరును మొత్తం బురదలోకి తొక్కుతూ, చిందరవందర చేసి అడవిలోకి వెళ్ళింది. 

అడవి పంది చేసిన పనిని అక్కడ ఉన్న రైతులు గమనించారు. అడవి పంది పైరుని బురద పాలు ఎందుకు చేసిందో రైతులకు అర్థం కాలేదు. రైతులు ఎంత కష్టపడ్డా మడిలో పైరును బురదలోంచి పైకి తీయలేకపోయారు. రైతులు  కర్రలు పట్టుకొని అడవి పంది వెళ్లిన అడవిలోకి వెళ్లారు. అడవంతా బురదగా ఉంది. అంతటా గడ్డి ఎర్రగా మారిపోయి ఉంది. బురదలో రైతులు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. చేసేది లేక వెనుకడుగు వేసి ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు రైతులంతా చేతిలో పారలతో అడవిలోకి వెళ్లి, బురద మడుగు నీళ్లు అన్నింటిని కాలువలుగా చేసి సరి చేశారు. ఎంత వర్షం వచ్చినా కొంచెంసేపట్లోనే నీళ్లు అడవి నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అడవి చుట్టూ కుంటలు నిర్మించారు. ఇప్పుడు అడవిలో చుక్క నీరు నిలవడం లేదు. పాతిక రోజుల తర్వాత మళ్లీ అడవిలో జంతువుల అరుపులు రైతులకు వినిపించాయి. ఆ అరుపులు ఆనందంతో గెంతులు వేస్తూ వస్తున్న అరుపులు. జంతువుల అరుపులు వింటూ రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకోసాగారు. ఇలా అడవిలో జంతువులు అడవి బయట రైతులు ఆనందంగా జీవించసాగారు.
- ఉండ్రాళ్ళ రాజేశం