
రాహుల్ రాజీనామాకు
రెండు నెలలు
కొత్త అధినేతను
ఎన్నుకోని నాయకత్వం
ఆరునెలల్లో 5 రాష్ట్రాల్లో
అసెంబ్లీ ఎన్నికలు
వారంలో సీడబ్ల్యూసీ భేటీ అంటున్న ఏఐసీసీ వర్గాలు
లేటయ్యే కొద్ది పార్టీకి కష్టాలేనంటున్న శశిథరూర్
వెలుగు బ్యూరో:వందేళ్లకు మించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధినాయకత్వం ఉందో లేదో, కొత్త నాయకత్వం ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం నాయకుల్లో, కేడర్ లో కొనసాగుతోంది. అధినేతగా రాజీనామా చేశానని రాహుల్ గాంధీ తేల్చి చెబుతుంటే, మేం దాన్ని ఆమోదించలేదని సీడబ్ల్యూసీ అంటోంది. అయితే రాహుల్ మాత్రం కొత్త అధినేతను వర్కింగ్ కమిటీనే నిర్ణయించాలని అంటున్నారు. ఈ అయోమయం ఎంతకాలమని పార్టీ కేడర్ లో చర్చ జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ, గోవా, కర్నాటకల్లో లాగే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీకి ఇబ్బందులు తప్పవని వారు రాష్ట్రాల నేతలు ఆందోళన పడుతున్నారు.
వరుసగా రెండు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడ్డ కాంగ్రెస్ లో ఇప్పుడు పార్టీ పెద్దలే కేడర్ ను మరింత అయోమయంలోకి నెడుతున్నారు. ఎన్నికలు ముగిసి మూడునెలలు కావస్తున్నా ఆ షాక్ నుంచి అగ్రనాయకత్వం తేరుకోలేదు. ఓటమికి కారణాలపై ఇప్పటివరకు విశ్లేషించుకునే ప్రయత్నం చేయలేదు. జరిగింది వదిలేసినా జరగబోయే ఎన్నికలపైనా దృష్టిపెడుతున్నట్లు కనిపించడం లేదు.
ఎవరు ప్రెసిడెంట్? ఎవరు వర్కింగ్?
2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలోనే అతి తక్కువగా 44 సీట్లకు పడిపోయింది. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో కనీసం వంద సీట్లు అయినా దక్కించుకుంటామని ఆశలుపెట్టుకుంది. కొన్ని సీట్లు పెరిగి 52కు చేరినా ప్రతిపక్ష హోదాను మాత్రం మళ్లీ పోగొట్టుకుంది. ఇది దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ ను నిరాశకు గురిచేసింది. ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ఏర్పాటు చేసిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఓటమికి నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు వర్కింగ్ కమిటీ చెప్పింది. రాహుల్ మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని తనను కలిసేందుకు ప్రయత్నించిన నేతలకు కొద్దిరోజుల పాటు ఆయన అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. జులై 3 వరకు రాజీనామాపై బహిరంగంగా స్పందించని రాహుల్ ఆ రోజు రిజైన్ లెటర్ ను మీడియాకు విడుదల చేశారు. పార్టీ లోక్ సభా పక్షనేతగా ఉండాలని నేతలు కోరినా రాహుల్ కాదన్నారు. దీంతో బెంగాల్ కు చెందిన అధీర్ రంజన్ చౌదరిని ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నారు. త్వరలోనే సీడబ్ల్యూసీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని రాహుల్ లేఖలో రాశారు. ఈ లేఖ బయటికి వచ్చి దాదాపు నెలరోజులు అవుతున్నా ఇప్పటికీ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరగలేదు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక పెండింగ్ లోనే ఉండిపోయింది.
ఇటు అధినేత ఖాళీ… అటు పార్టీ ఖాళీ
కొత్త అధినేత ఎవరో క్లారిటీ లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కొద్దిమంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోగా ఎన్నికలయిపోయిన నెల రోజుల్లోపే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేశారు. గోవాలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ మోడల్ నే ఫాలో అయ్యారు. అక్కడ 15 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి ఏకంగా 10 మంది బీజేపీలో చేరారు. వెంటనే శాసనసభాపక్షాన్ని కూడా బీజేపీలో విలీనం చేశారు. పార్టీకి అధినేత లేని లోటు కర్నాటకలో స్పష్టంగా కనిపించింది. జేడీఎస్ తో రాజీపడి సీఎం పదవిని అప్పగించినా అక్కడ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఒకేసారి 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముంబైలో మకాం వేయడంతో సంకీర్ణ సర్కారు పడిపోయింది. యడియూరప్ప నాయకత్వంలో బీజేపీ సర్కారు ఏర్పాటైంది. ఇదే తరహాలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు పంజాబ్ లో బలమైన కాంగ్రెస్ సర్కారు ఉన్నా సీఎం అమరీందర్ సింగ్, సీనియర్ నేత సిద్దూ మధ్య విభేదాలు ముదిరిపోయాయి. దీంతో సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంత జరుగుతున్నా హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా రాజ్యసభలో తలాక్ బిల్లుపై ఓటింగ్ రోజే అమేథీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ సంజయ్ సిన్హ్ రాజీనామా చేశారు. అదే సమయంలో మహారాష్ట్రలో ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రిజైన్ చేశారు. వీరంతా బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ ను నిరాశలోకి నెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఓటమికి కారణాలపై ఏకే అంటోని నేతృత్వంలో కమిటీ వేసి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపై మాత్రం అలాంటి ప్రయత్నాలే మొదలుపెట్టలేదు.
జరగబోయేది చూసేదెవరు?
ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎదుర్కొన్న సంక్షోభం ఒక ఎత్తైతే ఇక ముందు జరగబోయేదే పార్టీ నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దగ్గరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. యూపీ తర్వాత అతి పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రతో పాటు హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ లలో నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోరమైన ఓటమి ఎదురైంది. దీనికి తోడు అధినేత లేకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదు. దీంతో సీనియర్ నేతలు శశి థరూర్, అమరీందర్ సింగ్ లాంటివారు అధినేత ఎంపిక విషయంలో లేటైతే మొదటికే మోసం వస్తుందంటున్నారు.
కొత్త అధినేతగా ప్రియాంక గాంధీ రావాలని వీరిద్దరూ కోరుతున్నారు. ఒకవేళ ఆమె కాకపోతే మరొకరిని అయినా సరే త్వరగా నియమించాలని చెబుతున్నారు. మరోవైపు వారం పదిరోజుల్లోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉండొచ్చని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. రాహుల్ రాజీనామాను ఆమోదించాలన్నా, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్నా వర్కింగ్ కమిటీనే నిర్ణయించాల్సి ఉంది. దీంతో ఆ భేటీలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జుల సమావేశం ఉన్నా అది రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకల ఏర్పాట్ల కోసమేనని అంటున్నారు. అయితే రాజీవ్ జయంతి అయిన ఆగస్టు 20లోపే వర్కింగ్ కమిటీ సమావేశమై కొత్త అధినేతను ఎంచుకుంటుందని పార్టీ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం.