35 లక్షల లగ్గాలకు రూ. 4.25 లక్షల కోట్ల ఖర్చు

35 లక్షల లగ్గాలకు రూ. 4.25 లక్షల కోట్ల ఖర్చు
  • వ్యాపారులు ఇప్పటి నుంచే రెడీ   సెయిట్ సర్వేలో వెల్లడి

వెలుగు బిజినెస్​ డెస్క్​: ఈ ఏడాది వెడ్డింగ్​ బిజినెస్​ జోరు మీదున్నట్లు ఒక  సర్వే వెల్లడించింది. 35 లక్షల పెండ్లిండ్ల ద్వారా మొత్తం రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఈ సర్వే రిపోర్టు అంచనా వేసింది. కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఆల్​ ఇండియా ట్రేడర్స్​ (సెయిట్​)కి చెందిన  రీసెర్చ్​ సంస్థ పై సర్వేను నిర్వహించింది. నవంబర్​23 న మొదలై డిసెంబర్​ 15 దాకా కొనసాగే వెడ్డింగ్​ సీజన్​ కోసం ట్రేడర్లు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
 ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వెడ్డింగ్స్​ చోటు చేసుకోనున్నాయని, దీని ద్వారా లక్ష కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. కిందటేడాది దేశంలో 32 లక్షల పెండ్లిండ్లు జరిగాయి. అప్పట్లో రూ. 3.75 లక్షల కోట్ల బిజినెస్​ జరిగిందని సెయిట్​ నేషనల్​ ప్రెసిడెంట్​ బీ సీ భర్తియా వెల్లడించారు.  23 రోజులపాటు సాగే వెడ్డింగ్​ సీజన్​లో 6 లక్షల పెండ్లిండ్లలో ఒక్కో పెండ్లికీ రూ. 3 లక్షలు, 10 లక్షల పెండ్లిండ్లలో ఒక్కో పెండ్లికీ రూ. 6 లక్షలు చొప్పున బిజినెస్​ జరుగుతుందని సెయిట్​ సెక్రటరీ జనరల్​ ప్రవీణ్​ ఖండేల్​వాల్​ చెప్పారు. 
మరో 12 లక్షల పెండ్లిండ్లలో ఒక్కో పెండ్లికీ ఖర్చు రూ. 10 లక్షల దాకా ఉంటుందని, ఇంకో 6 లక్షల పెండ్లిండ్లలో ఒక్కో పెండ్లికీ ఖర్చు రూ. 25 లక్షల దాకా ఉండొచ్చని పేర్కొన్నారు. 50 వేల వెడ్డింగ్స్​లో ఒక్కో వెడ్డింగ్​కు రూ. 50 లక్షలు, మరో 50 వేల పెండ్లిండ్లలో ఒక్కో పెండ్లికీ రూ. కోటికి మించి ఖర్చు పెడతారని ఆయన అంచనా వేశారు.  వెడ్డింగ్​ సీజన్​లో భారీ బిజినెస్​ సాధించేందుకు ట్రేడర్లు అన్ని విధాల రెడీ అవుతున్నారని భర్తియా వివరించారు. 
కస్టమర్ల రద్దీని తట్టుకునేందుకు సరైన ప్లానింగ్​తో వారు ముందుకొస్తున్నట్లు చెప్పారు. బాంకెట్​ హాల్స్​, హోటల్స్​, ఓపెన్​ లాన్స్​, కమ్యూనిటీ సెంటర్స్​, పబ్లిక్​ పార్క్స్​, ఫార్మ్​ హౌస్​లు వంటివన్నీ తాజా పెండ్లిండ్ల సీజన్​కోసం సిద్ధమవుతున్నట్లు ఖండేల్​వాల్​ పేర్కొన్నారు. టెంట్​ డెకొరేటర్లు, ఫ్లవర్​ డెకొరేషన్స్​, క్రోకరీ, కేటరింగ్​ సర్వీస్​, ట్రావెల్​ సర్వీస్​, క్యాబ్​ సర్వీస్​, వెల్​కమింగ్​ ప్రొఫెషనల్​ గ్రూప్స్, వెజిటబుల్​ వెండర్స్​, ఫొటోగ్రాఫర్స్​, వీడియో గ్రాఫర్స్, బ్యాండ్​–బాజా, షెహనాయ్​, ఆర్కెస్ట్రా, డీజే, ఊరేగింపుల కోసం గుర్రాలు, వ్యాగన్లు, లైట్స్​ వంటి అనేక సర్వీసులకు కూడా ఫుల్లు గిరాకీ ఉంటుందని ఆయన వివరించారు.