ముప్పై తర్వాత కంటేనే మంచిదట

ముప్పై తర్వాత కంటేనే మంచిదట

ఇరవై నుంచి ముప్పై ఏళ్లు వచ్చేలోపు పిల్లల్ని కంటేనే మంచిదని చాలా మంది అభిప్రాయం. అంతకంటే లేటయితే పిల్లలు పుట్టడం కష్టమవుతుందని పెద్దలు చెప్తుంటారు. అయితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా మంది లైఫ్​లో సెటిలయ్యాక కానీ, పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. ఇలాంటివాళ్లంతా ముప్పై ఏళ్ల తర్వాతే పిల్లల్ని కంటున్నారు. అయితే ఇదే చాలా మంచిదని తాజా స్టడీ ఒకటి తేల్చింది. ముప్పై తర్వాత పిల్లల్ని కంటే…  ఆ పిల్లలు చాలా స్మార్ట్​గా ఉంటారని ఈ స్టడీ చెప్పింది.

పిల్లల తెలివితేటలకి, తల్లుల వయసుకు సంబంధం ఉందా అనే అంశంపై బ్రిటన్​కు చెందిన ‘మిలీనియం కోహోర్ట్​ స్టడీ’ అనే సంస్థ అధ్యయనం చేసింది. దాదాపు పద్దెనిమిది వేల మంది పిల్లల్ని, వాళ్ల తల్లుల్ని సైంటిస్టులు స్టడీ చేశారు. ఈ స్టడీ ప్రకారం 20–29 ఏళ్ల వయసులో తల్లులైన వాళ్ల పిల్లలతోపోలిస్తే 30–39 ఏళ్ల మధ్య వయసులో తల్లులైన వాళ్ల పిల్లలు చాలా తెలివితేటలతో ఉన్నారు. ఇదే అంశంపై స్వీడన్​కు చెందిన మరో సంస్థ అధ్యయనం చేసింది. పదహారేళ్ల వయసు కలిగిన పిల్లలు చదువుకు సంబంధించి జీపీఏ (గ్రేడ్​ పాయింట్​ యావరేజ్)ను సైంటిస్టులు స్టడీ చేశారు. దీని ప్రకారం 30–34 ఏళ్ల వయసులో తల్లులైన వాళ్ల పిల్లలకంటే 35–39 ఏళ్లకు తల్లులైన వారి పిల్లలు ఎక్కువ జీపీఏ సాధించారు. లేటు వయసులో పిల్లల్ని కంటే వాళ్లు చాలా ఎక్కువ తెలివితేటలు కలిగి ఉన్నట్లు  తేలింది.

కారణాలు

లేటు వయసులో పుట్టే పిల్లలు ఎక్కువ తెలివిగలవాళ్లవడానికి కొన్ని కారణాలున్నాయని ‘ద లండన్​ స్కూల్​ ఆఫ్​ ఎకనామిక్స్’ జరిపిన స్టడీ తేల్చింది. దీని ప్రకారం ముప్పై తర్వాత తల్లులయ్యే వాళ్లకు కొన్ని అంశాలు కలిసొస్తున్నాయి. వీళ్లు చాలా ఎడ్యుకేటెడ్​ అయ్యుంటున్నారు. అప్పటికే లైఫ్​లో ఫైనాన్షియల్​గా సెటిల్​ అవుతున్నారు. భర్త, కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్స్​ మెయింటెయిన్​ చేయగలరు. హెల్దీ లైఫ్​స్టైల్​ లీడ్​ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో, పిల్లల్ని పెంచడంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నారు. ఇవన్నీ పుట్టే పిల్లల తెలివి పెరగడానికి ఉపయోగపడుతున్నాయి.

మరీ ఎక్కువైనా కష్టమే

లేటు వయసులో పుట్టే పిల్లలు స్మార్ట్​గా ఉంటున్నారని మరీ లేటుగా పిల్లల్ని కనకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఈ ఫలితాలు 30–39 ఏళ్ల వరకే పరిమితమంటున్నారు. నలభై ఏళ్లొచ్చాక పిల్లల్ని కంటే వాళ్లు మరీ అంత స్మార్ట్​ కాకపోవచ్చని కూడా ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే 20–29 ఏళ్ల వయసులో తల్లులైన వాళ్లకంటే, నలభై ఏళ్లయ్యాక తల్లులైన వాళ్ల పిల్లలు కాస్త మెరుగ్గా ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. 1958–70 వరకు పుట్టిన పిల్లలకు సంబంధించిన డాటాపై మరో సంస్థ స్టడీ చేసింది. అప్పట్లో మాత్రం లేటు వయసులో తల్లులైన వాళ్ల పిల్లలు తక్కువ తెలివితేటలతో  ఉన్నట్లు తేలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముప్పై ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటేనే అన్ని రకాలుగా బెటర్​ అని సైంటిస్ట్‌ చెబుతున్నారు. ఇది తల్లులకు, పిల్లలకూ మేలు చేస్తుందంటున్నారు.